ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

వైసీపీ వాష్ ఔట్…  ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు.

Share This Post 🔥

11 సీట్లకే పరిమితం.. దక్కని ప్రతిపక్ష హోదా


టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ.. 164 సీట్లతో విజయకేతనం


సీఎం జగన్, పెద్దిరెడ్డి మినహా మిగతా మంత్రులందరూ ఓటమి.


జగన్ రాజీనామా.. గవర్నర్ కు లెటర్


లోక సభ ఎన్నికల్లోనూ కూటమి ప్రభంజనం..

21 సీట్లలో గెలుపు


కేవలం 4 సీట్లకే పరిమితమైన వైసీపీ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ చిత్తుగా ఓడిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉండగా, కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించింది. టీడీపీ 135 సీట్లలో గెలుపొందగా.. జనసేన 21, బీజేపీ 8 సీట్లలో గెలిచాయి. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది.

ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 18 సీట్లు గెలుచుకోవాల్సి ఉండగా, అంతకంటే 7 సీట్ల దూరంలోనే నిలిచిపోయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు 151 సీట్లతో రికార్డు విజయాన్ని అందుకున్న వైసీపీ.. ఈసారి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. వైసీపీ చీఫ్, సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా కేబినెట్ లోని మంత్రులందరూ పరాజయం పాలయ్యారు. కాగా, సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్కు మంగళవారం రాజీనామా లెటర్ పంపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు కొనసాగాలని ఆయనను గవర్నర్ కోరినట్టు గవర్నర్ స్పెషల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటనలో పేర్కొన్నారు.

8 ఉమ్మడి జిల్లాల్లో జీరో...

ఏపీలోని13 ఉమ్మడి జిల్లాలకు గాను 8 జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురంలో ఖాతా తెరవలేదు. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు వస్తాయని అనుకున్నప్పటికీ.. ఆ రెండు చోట్ల కూడా టీడీపీ, జనసేననే ఎక్కువగా సీట్లు గెలుచుకున్నాయి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో గత ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలుచుకున్న వైసీపీ.. ఈసారి కేవలం 3 సీట్లకే పరిమితమైంది. వైసీపీ గెలుచుకున్న సీట్లలో విశాఖపట్నం జిల్లాలో 2, చిత్తూరు 2, కడప 3, కర్నూలు 2, ప్రకాశం జిల్లాలో 2 ఉన్నాయి.

నాలుగే ఎంపీ సీట్లు..

ఏపీ లోక్ సభ ఎన్నికల్లోనూ కూటమి సునామీ సృష్టించింది. మొత్తం 25 స్థానాలకు గాను 21 కైవసం చేసుకుంది. టీడీపీ 16, జనసేన 2, బీజేపీ 3 సీట్లలో విజయం సాధించాయి. ఇక అధికార వైసీపీ కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. కడప, రాజంపేట, తిరుపతి (ఎస్సీ ), అరకు (ఎస్టీ) మాత్రమే విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో 22 ఎంపీ సీట్లు గెలుచుకున్న వైసీపీ బలం ఈసారి 4 సీట్లకు పడిపోయింది. కడప నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డి 62,695 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల కేవలం లక్షా 41 వేల 39 ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇక రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 76,071 ఓట్ల మోజార్టీతో, తిరుపతి నుంచి మద్దెల గురుమూర్తి 14,569 ఓట్ల మెజార్టీతో, అరకు నుంచి గుమ్మ తనూజ రాణి 50,580 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ప్రజా వ్యతిరేకతే కారణమా…?

వైసీపీ ఘోర పరాజయానికి ప్రజా వ్యతిరేకతే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజధాని అంశం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత ప్రధాన కారణాలని పేర్కొంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించగా, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మూడు రాజధానులను ప్రకటించారు. కర్నూల్ ను జ్యుడీషియల్ క్యాపిటల్ గా, వైజాగ్ ను అడ్మినిస్ర్టేటివ్ క్యాపిటల్ గా, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా చేస్తామని చెప్పారు. వైజాగ్ నుంచి పాలన చేయాలని భావించి, అక్కడి రిషికొండపై సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మించారు. కానీ అక్కడికి షిఫ్ట్ కాలేదు. మూడు రాజధానులు ముచ్చటగానే మిగిలిపోయాయి. ఇక దశల వారీగా మద్య నిషేధం అని చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. పైగా నకిలీ మద్యం అమ్ముతున్నారనే విమర్శలు ఉన్నాయి. వైఎస్ వివేకా హత్య కేసు విషయంలోనూ అధికార పార్టీకి డ్యామేజీ జరిగింది. నిందితులను ప్రభుత్వమే కాపాడుతున్నదంటూ వివేకా కూతురు సునీత ఆరోపించారు.

ఆశ్చర్యంగా ఉంది : జగన్

ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని సీఎం జగన్ అన్నారు. రిజల్ట్స్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదని చెప్పారు. ‘మహిళలకు సంక్షేమ పథకాలు అందించాం. ఇంటికే పథకాలు పంపించాం. ఒక కోటి 5 లక్షల మంది అక్కాచెల్లెళ్ల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియడం లేదు. 54 లక్షల మంది రైతున్నలకు పెట్టుబడి సాయం అందించాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించి 99 శాతం అమలు చేశాం. అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలని చూశాం. అందుకే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశాం. అన్ని వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చాం. అయినా ఎందుకు ఇలా అయిందో తెలియడం లేదు’ అని అన్నారు. ఎవరేం చేసినా తమకున్న 40 శాతం ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారని పేర్కొన్నారు. ‘పోరాటాలు మాకు కొత్త కాదు. కచ్చితంగా మళ్లీ లేస్తం. గుండె ధైర్యంతో ముందుకెళ్తాం. ప్రతిపక్షంలో ఉండటం మాకు కొత్త కాదు. నా రాజకీయ జీవితంలో ఎక్కువ శాతం ప్రతిపక్షంలోనే ఉన్నా. ఎవరూ చూడని కష్టాలు చూసిన. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నా’ అని అన్నారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!