Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

ఊపందుకున్న నాయకుల ప్రచారం.

Share This Post 🔥

బహిరంగ సభలతో జనంలోకి పార్టీలు.  

గ్రేటర్ హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. నాయకులంతా జనంలోకి వెళ్లడానికి రోడ్డెక్కుతున్నారు. దీంతో ఒకవైపు కాంగ్రెస్‌ మరోవైపు భారాస, భాజపా పోటాపోటీగా ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. రాజధాని పరిధిలో సికింద్రాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి, హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాలున్నాయి. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మొన్నటివరకు ఎక్కడా ఎన్నికల హంగామా కనిపించలేదు. కిందిస్థాయి నాయకుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎవరూ ప్రచారంలో పాల్గొనలేదు. గురువారంతో నామినేషన్ల ఘట్టం పూర్తికావడం.. ప్రచారానికి 16 రోజులే ఉండటంతో అన్ని పార్టీలు ఒక్కసారిగా రంగంలోకి దూకాయి. ఒకవైపు అగ్రనేతలతో ప్రచారం చేయడంతో పాటు మరోవైపు స్థానిక నేతలతో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలవడానికి సిద్ధమవుతున్నారు.

కాంగ్రెస్‌ దూకుడు

మిగిలిన పార్టీలతో పోల్చుకుంటే రాజధాని పరిధిలో కాంగ్రెస్‌ ప్రచారంలో దూకుడుగా ముందుకెళ్తోంది. ఈ నెల 6న తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాటు చేసి మ్యానిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సభలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మల్కాజిగిరి స్థానానికి సంబంధించి శామీర్‌పేటలో భారీ సభ నిర్వహించారు. సికింద్రాబాద్‌ ప్యాట్నీ సెంటర్‌లో కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. గురువారం చేవెళ్లకు సంబంధించి అత్తాపూర్‌లోనూ, కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి అన్నానగర్‌ చౌరాస్తా వద్ద జరిగిన సభల్లో సీఎం భాజపా, భారాసలపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ పరిధిలో భారీ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 10లోగా మరో ఆరేడు సభలు నిర్వహించాలని నిర్ణయించారు. రాహుల్‌తో పాటు కాంగ్రెస్‌ అగ్రనేతలు పాల్గొనబోతున్నారు.

ఎమ్మెల్యేలే కీలకంగా…

ఇప్పటికే చేవెళ్లలో భారాస కొద్దిరోజుల కిందట భారీ బహిరంగ సభను నిర్వహించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభలో కీలక ప్రసంగం చేశారు. ఇప్పుడు ఆయన వచ్చే నెల పదో తేదీ వరకు జిల్లాల్లో జరుగుతున్న బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. 11వ తేదీ తరువాత ఇక్కడ మరో భారీ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్‌ అన్ని లోక్‌సభ నియోజకవర్గాల సమీక్షలు పూర్తి చేశారు. రాజధానిలో నాలుగు స్థానాల ప్రచార బాధ్యతను ఆయన తలకెత్తుకున్నారు. నియోజకవర్గాల వారీగా కార్నర్‌ మీటింట్‌లు నిర్వహించడానికి కేటీఆర్‌ సిద్ధమవుతున్నారు. ఈలోపులో పార్టీపరంగా ప్రచార బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. వారం రోజుల కిందటి వరకు ఎమ్మెల్యేల్లో కదలిక కనిపించలేదు. పార్టీ ఆదేశాలతో రంగంలోకి కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యేలందరితో కేటీఆర్‌ రోజువారీగా మాట్లాడుతున్నారు.

ఇంటింటి ప్రచారంపై దృష్టి

అన్ని పార్టీలకంటే ముందే భాజపా అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులు ఇప్పటికే మొదటి విడత ప్రచారాన్ని పూర్తి చేశారు. ఇంటింటి ప్రచారంపైనే ప్రధానంగా దృష్టిసారించారు. వివిధ సంఘాలతో సమావేశమై మరోసారి మోదీ ప్రధాని కావాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు. గత నెలలో మల్కాజిగిరిలో మోదీ రోడ్డుషో నిర్వహించారు. ప్రచారం ముగిసేలోగా ఆయన రాజధాని పరిధిలో రెండు బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఈ నెల 30న మోదీ హైదరాబాద్‌కు చేరుకుని శేరిలింగంపల్లిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో సమావేశం కానున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సైతం ప్రచారంలో పాల్గొంటారని భాజపా నేతలు చెబుతున్నారు. మరోవైపు ఎంఐఎం హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి అసదుద్దీన్‌ ఇప్పటికే తన పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!