జాతీయంతెలంగాణరాజకీయం

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే ఒక పాలసీ.

Share This Post 🔥

రాష్ట్రంలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీ ని తీసుకు వస్తామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. బుధవారం ఖమ్మంలో జరుగుతున్న టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర తృతీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల కీలక పాత్రను పోషించారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పడికట్టు పదాలతో సమస్యలు తీరుస్తామంటూ హామీలు ఇచ్చారే గాని ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా పాలన రావడానికి జర్నలిస్టులు కృషి చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గతంలో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలకు సంబంధించి కోర్టులో కేసు వల్ల ఆగిపోయాయని, ఏడాది క్రితమే ఆ కేసు క్లియర్ అయినా కూడా గత ప్రభుత్వం ఇప్పటివరకు వారికి ఇళ్లస్థలాలను ఇవ్వలేదని విమర్శించారు.

త్వరలోనే ఆ స్థలాలను హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారం, పది రోజుల్లోనే దానికి సంబంధించిన జీవో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. అలాగే హైదరాబాద్లో మిగిలిపోయిన మిగతా జర్నలిస్టులకు, జిల్లాలు, మండలాల్లో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే ఒక పాలసీని తీసుక వస్తున్నామని చెప్పారు. గతంలో ఖమ్మంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇచ్చిన జీవో ఆగిపోయిందని తెలిపారు.

మరొక స్థలాన్ని చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించామని ఆ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవుతుందని ప్రకటించారు. అక్రిడిటేషన్ల గడువు ఈ నెలాఖరు తో ముగుస్తున్నదని, మరో మూడు మాసాల పాటు గడువు పెంచుతున్నామని దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకటి వెలువడనున్నాయని మంత్రి పేర్కొన్నారు. వందకు వంద శాతం జర్నలిస్టులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, హెల్త్ కార్డులకు సంబంధించి, వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలను అధ్యయనం చేసి దానికి అనుగుణంగా జర్నలిస్టులకు వైద్యాన్ని అందిస్తామని అన్నారు.

జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ కోసం ఉన్నటువంటి అన్ని రకాల కమిటీలను త్వరలోనే పునరుద్ధ రిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి, ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, టియుడబ్ల్యూజే (ఐజెయు) రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, ఐజేయూ ప్రతినిధులు నరేందర్ రెడ్డి, కే సత్యనారాయణ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు, జాతీయ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!