ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంజాతీయంతెలంగాణమహిళరాజకీయం

మా హయాంలో పార్టీ ఫిరాయింపులు కాదు… విలీనం చేసుకున్నాము. :  కేటీఆర్.

Share This Post 🔥

ప్రస్తుత ఫిరాయింపులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం

సుప్రీంకు వెళ్తాం.. పార్లమెంటులో ప్రస్తావిస్తాం

ప్రజాసంబంధాల విషయంలో విఫలమయ్యాం

మాకు ఓట్లు వేయకపోవడం ప్రజల తప్పు కాదు.

పార్టీ పేరు మార్పు వల్ల ప్రభావమేం పడలేదు

కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకే కవితను జైలుకు..

కేంద్రంలో ఏపీ సీఎం చంద్రబాబుది కీలక పాత్ర

తెలుగు రాష్ర్టాలకు నిధులు తీసుకొస్తే మంచిదే

తెలంగాణలో టీడీపీ బలపడితే.. మాకే లబ్ధి

ఏపీలో జగన్‌ ఓడిపోతారని ఊహించలేదు

40 శాతం ఓట్లు తెచ్చుకున్న జగన్‌ హీరో.. షర్మిల జీరో

ఢిల్లీలో మీడియాతో కేటీఆర్‌ వ్యాఖ్యలు

ఫిరాయింపు నేతలను ప్రజలు నమ్మరు: హరీశ్‌

తెలంగాణలో చోటుచేసుకుంటున్న ఎమ్మెల్యేల ఫిరాయింపులపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. త్వరలోనే సుప్రీంకోర్టునూ ఆశ్రయిస్తామని, రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావిస్తామని తెలిపారు. ఇప్పటికే హైకోర్టులో కేసు వేశామని, స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, దీవకొండ దామోదర్‌రావుతో కలిసి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. అనంతరం మీడియాతో చిట్‌చాట్‌ చేశారు.

మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ హయాంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో శాసనసభాపక్షాలను విలీనం చేసుకున్నామే తప్ప.. ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకుంటూ ఫిరాయింపులకు పాల్పడలేదన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ, బీఎస్పీ శాసనసభాపక్షాలను బీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం చేసుకున్నామని తెలిపారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి తమ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు.

ఓవైపు రాజ్యాంగం గొప్పతనం గురించి మాట్లాడుతూ.. మరోవైపు అదే రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని అన్నారు. కర్ణాటక, గోవాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుపై బీజేపీని తప్పుబడుతూ, మరోవైపు తెలంగాణలో మాత్రం ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని ఆరోపించారు.

కాంగ్రెస్ ను ఎండగట్టడానికే వచ్చాం..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ అధిష్ఠానం అనుమతి తీసుకుని ఫిరాయింపులకు పాల్పడుతున్నారని, పాత్రధారి తెలంగాణలో ఉంటే, సూత్రధారులు ఢిల్లీలో ఉన్నారని కేటీఆర్‌ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీని జాతీయ స్థాయిలో ఎండగట్టడానికే ఢిల్లీకి వచ్చామని, మూడు,

నాలుగు రోజులుగా న్యాయ, రాజ్యాంగ నిపుణులతో చర్చించామని తెలిపారు. ”బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్‌ పార్టీ సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. ఇంతకంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఇంకేం ఉంటుంది? కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఇచ్చి బీజేపీ కొనుగోలు చేస్తోందంటూ సీఎం సిద్దరామయ్య అంటున్నారు. తెలంగాణలో మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఇస్తున్నారో? ఇంకా ఎక్కువే ఇస్తున్నారో తెలియదు.

రాజ్యాంగ రక్షకుడిగా రాహుల్‌గాంధీ ఆస్కార్‌ అవార్డు స్థాయిలో నటిస్తున్నారు. దానం నాగేందర్‌తోపాటు మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేస్తారని ఆశిస్తున్నాం” అని కేటీఆర్‌ పేర్కొన్నారు. స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని, హైకోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిరాయింపులకు పాల్పడిన చోట త్వరలోనే ఉప ఎన్నికలు రావడం ఖాయమని అన్నారు.

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా మాట్లాడొద్దు

మీడియా సమావేశంలో  ఓ విలేకరిపై కేటీఆర్‌ రుసరుసలాడారు. ఫిరాయింపుల అంశంపై మాట్లాడుతుండగా.. బీఆర్‌ఎస్‌ హయాంలో కూడా ఫిరాయింపులను ప్రోత్సహించారు కదా? అప్పుడు రాజ్యాంగం గుర్తు రాలేదా? అని  విలేకరి ప్రశ్నించగా, ‘మీరు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు’ అంటూ కేటీఆర్‌ మండిపడ్డారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను ఎలా చేర్చుకున్నారనే ప్రశ్నను మధ్యలోనే అడ్డుకుని ‘నాతో వాగ్వాదానికి దిగొద్దు’ అని కేటీఆర్‌ హెచ్చరించారు.

14 సీట్లలో స్వల్ప తేడాతో ఓడిపోయాం..

తెలంగాణలో అన్ని పార్టీల్లోకెల్లా అతిపెద్ద నాయకుడు కేసీఆర్‌ అని కేటీఆర్‌ తెలిపారు. అలాంటిది బీఆర్‌ఎ్‌సలో ఆయనను కాదని పోటీ ఎందుకుంటుందని ప్రశ్నించారు. ”అసెంబ్లీ ఎన్నికల్లో 14 సీట్లలో స్వల్ప తేడాతోనే ఓడిపోయాం. 1000 నుంచి 5వేల ఓట్లతోనే ఓటమి పాలయ్యాం. కానీ, ఒక్క ఓటుతో ఓడిపోయినా ఓటమే కదా? బీజేపీ అయోధ్యలో ఓడిపోయింది. ప్రశాంత్‌ కిషోర్‌ సొంతంగానే పార్టీని నడపలేకపోయారు. ఇక ఆయన పార్టీలను ఎలా గెలిపిస్తారు? తెలంగాణలో బీజేపీ ఎంపీలను ఓడించింది బీఆర్‌ఎస్‌ పార్టీయే కదా? అయినా ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా ఏదో ఒక కూటమికే ప్రజలు ఓట్లు వేశారు.

ఈ రెండు కూటములతో లేని పార్టీలను ప్రజలు ఆదరించలేదు. ఇప్పుడు కిందపడ్డాం.. మళ్లీ లేవాలి.” అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేంద్రంలో చంద్రబాబునాయుడు కీలక స్థానంలో ఉన్నారని, ఆయన ద్వారా తెలుగు రాష్ర్టాలకు మంచి జరిగితే స్వాగతిస్తామని అన్నారు. ”రేవంత్‌రెడ్డి, చంద్రబాబు సమావేశాన్ని ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంగానే చూడాలి.

మేము ప్రతిపక్షంలో ఉన్నంతమాత్రాన రాష్ట్రం బాగుపడొద్దని మేమేందుకు అనుకుంటాం? నిధులు రావాలి.. పరిశ్రమలు రావాలి.. అభివృద్ధి జరగాలి. అయినా.. నాలుగేళ్ల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. అభివృద్ధి, సంక్షేమం వల్లే ఓట్లు వేయరని తేలిపోయింది కదా? అందుకే.. ఈ నాలుగేళ్లు మంచి జరగాలని ఆశిస్తాం” అని కేటీఆర్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలను ఊహించలేదన్నారు. జగన్‌ సంక్షేమం చేసినందున గెలుస్తారని భావించాం తప్ప.. ఎవరి మీదా ప్రత్యేకంగా ప్రేమ లేదని అన్నారు. ”జగన్‌ వ్యతిరేకఓట్లన్నీ ఏకమయ్యాయి. అయినా.. ఆయన పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. జగన్‌ను ఓడించేందుకు షర్మిలను ఒక వస్తువులా ఉపయోగించారు. అంతకుమించి షర్మిలతో అయ్యేదేమీ లేదు. జగన్‌ హీరో.. షర్మిల జీరో” అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

అహంకారం కాదు.. ఆత్మవిశ్వాసం…

కేసీఆర్‌కు, తనకు అహంకారం ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. అయితే.. అది అహంకారం కాదని, ఆత్మవిశ్వాసమని చెప్పారు. తెలంగాణ అంటే పడనోళ్లు చేేస అసత్య ప్రచారన్నారు. ”2014లో తెలంగాణ ఏర్పడితే ఎప్పుడైనా అహంకారం చూపించామా? ఎంతోమంది యూట్యూబ్‌ వేదికగా బండబూతులు తిట్టారు. ఎవరినైనా ఏమైనా అంటున్నామా? కానీ, రేవంత్‌ రెడ్డి చిన్న వార్త వస్తేనే తట్టుకోలేకపోతున్నారు. కేసులు పెడుతున్నారు. ఏపీలో బీఆర్‌ఎస్‌ పార్టీని పెట్టినప్పుడు తెలంగాణలో టీడీపీని నడిపితే తప్పేంటి? ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీ అయినా పెట్టొచ్చు. మేం కూడా ఏపీలో బీఆర్‌ఎస్‌ పెట్టాం. అయినా.. తెలంగాణలో టీడీపీ బలపడితే అది మాకే లాభం. హైదరాబాద్‌ చుట్టూ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలిగిందనే ధర్నా చౌక్‌ తీసేశాం. తర్వా త మళ్లీ మేమే పెట్టాం. ముళ్ల కంచెలు వేసింది కిరణ్‌కుమార్‌ రెడ్డి. తీసింది రేవంత్‌రెడ్డి. ఇద్దరూ కాంగ్రెస్‌ వాళ్లే. రేవంత్‌రెడ్డి 420 హామీలు ఇచ్చారు. హనీమూన్‌ పీరియడ్‌ అయిపోయింది. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాగానే పింఛన్‌ పెంచి ఇచ్చారు. మీరెందుకు ఇవ్వలేదని ప్రజలు అడుగుతారు కదా? హామీలిచ్చే ముందు ఆర్థిక పరిస్థితేంటో ఆలోచించుకోవాలి. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలనే కవితను జైల్లో పెట్టారు. ఫాక్స్‌కాన్‌ త్వరలోనే పూర్తవుతుంది. ఆగస్టులో రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు” అని కేటీఆర్‌ తెలిపారు.

చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఓటమి..

చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి పాలైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ప్రజా సంబంధాల విషయంలో తాము విఫలమయ్యామన్నారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల ఫిరాయింపులు, కవిత బెయిల్‌ విషయంపై న్యాయ నిపుణులను కలిసినట్లు తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నామని, ఒక్కసారి ఓటమి పాలైనంత మాత్రాన బీఆర్‌ఎస్‌ పనైపోయిందనడం సరికాదని అన్నారు. ఐదేళ్ల క్రితం చంద్రబాబు పనైపోయిందన్నారని, కానీ ఇప్పుడు ఢిల్లీ అంతటా చంద్రబాబు ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమన్నారు. బీజేపీ 302 సీట్ల నుంచి 240 సీట్లకు పడిపోయిందని గుర్తు చేశారు. ”దాచుకోవడానికేం లేదు. కొన్ని విషయాల్లో చిన్న చిన్న పొరపాట్లు చేశాం. మాకు ఓట్లు వేయకపోవడం ప్రజల తప్పు కాదు. కొన్ని విషయాల్లో మేం చేసింది ప్రజలకు చెప్పుకోలేకపోయాం. టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎ్‌సగా మార్చడం వల్ల పెద్దగా ప్రభావం పడలేదనుకుంటున్నాం” అని కేటీఆర్‌ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!