ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

వికసించిన “కమలం”

Share This Post 🔥

చేవెళ్ల, మల్కాజిగిరిలో బీజేపీ ఘన విజయం.


అధికార పార్టీ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ

కొంపముంచిన అభ్యర్థుల ఎంపిక

బీఆర్‌ఎస్ కు తీవ్ర పరాభవం

ఒక్క ఎమ్మెల్యే లేకున్నా భారీ మెజార్టీ సాధించిన బీజేపీ.

చేవెళ్లలో 2లక్షల మెజార్టీతో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపు

మల్కాజిగిరిలో 4 లక్షల మెజార్టీతో ఈటల రాజేందర్‌ విజయం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రతిష్ఠాత్మకమైన రెండు లోక్‌సభ స్థానాలు చేవెళ్ల, మల్కాజిగిరిలో భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగించింది. మే 13న జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడగా ఈ రెండు చోట్లా బీజేపీ అభ్యర్థులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లు భారీ మెజారిటీలతో గెలుపొందారు. రెండు చోట్లా సమీప కాంగ్రెస్‌ అభ్యర్థులపై వారు విజయం సాధించారు. కాగా చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాల్లో బీఆర్‌ఎస్‌ మూడో స్థానంతో పరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ రెండు సెగ్మెంట్ల పరిధిలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేకున్నా లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది.

పార్లమెంట్‌ ఎన్నికల్లో కమలం వికసించింది. చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దుమ్మురేపింది. రెండు స్థానాల్లోనూ రికార్డుస్థాయిలో ఓట్లు కొల్లగొట్టి అఖండ విజయాలను నమోదు చేసింది. అధికార కాంగ్రెస్‌ పార్టీకి పార్లమెంట్‌ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎ్‌సకు ఈ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈ పార్లమెంట్‌ స్థానాల్లో అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌ రెండు స్థానాల్లో మూడోస్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మంగళవారం జరిగింది. మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్ధి పట్నం సునీతారెడ్డిపై 3,91,475 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజెపి అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 9,91,042 ఓట్లు లభించగా కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతారెడ్డికి 5,99,567 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి 3,00,486 ఓట్లు లభించాయి. ఇక చేవెళ్ల లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరెడ్డి తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డిపై దాదాపు 1,72,897 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వరెడ్డికి 8,09,882 ఓట్లు లభించగా కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి 6,36,985 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్‌ఎస్‌ తరుపున బరిలో దిగిన కాసాని జ్ఞానేశ్వర్‌కు 1,78,968 ఓట్లు లభించాయి. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార కాంగ్రెస్‌ పార్టీతో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీలు తీవ్రంగా శ్రమించాయి. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాలపై అందరి దృష్టి నెలకొనడంతో ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గాలైన చేవెళ్ల, మల్కాజిగిరిలో గెలుపొందేందుకు అన్ని వ్యూహాలను అమలు చేశాయి. మల్కాజిగిరి స్థానం సీఎం రేవంత్‌రెడ్డి సిట్టింగ్‌ సీటు కావడంతో ఇక్కడ ఎన్నిక ఆసక్తి రేకెత్తించింది. అలాగే చేవెళ్లలో ప్రధాన పార్టీల నుంచి అపర కుభేరులు రంగంలో దిగడంతో ఇక్కడ ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశారు. అయితే ఈ రెండుస్థానాల్లో చివరకు విజయం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులనే వరించింది.

బీఆర్‌ఎస్‌ ఓటు బీజేపీకి షిఫ్ట్‌.!

అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆరు నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మూడోస్థానంలో ఉన్న బీజేపీ తక్కువ వ్యవధిలోనే మొదటి స్థానంలో నిలవడమేకాక రికార్డు స్థాయిలో ఓట్లు సాధించింది. దీనికి కారణం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంక్‌ చివరి క్షణంలో బీజేపీవైపు మొగ్గుచూపినట్లు స్పష్టమవుతోంది. బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయాక పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతుండడంతో ఆ పార్టీకి సంబంధించిన ఓటర్లు, అభిమానులు మెజార్టీ సంఖ్యలో బీజేపీ వైపు మొగ్గుచూపారు. దీంతో బీజేపీకి ఈ ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు లభించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో బీఆర్‌ఎస్ కు 40.85శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌ పార్టీకి 35.2శాతం ఓట్లు, బీజేపీకి 19.37 శాతం ఓట్లు వచ్చాయి. అయితే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన ఓటు బ్యాంకును కొంత మెరుగుపరుచుకున్నప్పటికీ బీఆర్‌ఎస్‌ తన ఓటు బ్యాంకు గణనీయంగా కోల్పోయింది. ఈ ఓట్లన్నీ కూడా బీజేపీకి బదిలీ అయ్యాయి. అలాగే కాంగ్రె్‌సలో అసంతృప్తిగా ఉన్న వారు కూడా బీజేపీవైపు మొగ్గుచూపారు. దీంతో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 48.36శాతం ఓట్లు లభించడం విశేషం. అలాగే కాంగ్రె్‌సకు 38.03శాతం ఓట్లు లభించాయి. బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు 10.68 శాతానికి పడిపోయింది. అంటే ఆరు నెలల కాలంలో 30శాతం ఓట్లు ఈ నియోజకవర్గపరిధిలో బీఆర్‌ఎస్‌ కోల్పోయింది. అలాగే మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానం పరిధిలో కూడా ఇదే జరిగింది. ఈ స్థానంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల పరిధిలో బీఆర్‌ఎ్‌సకు 47శాతం ఓట్లు రాగా కాంగ్రె్‌సకు 30.05శాతం,. బీజేపీకి 20.56శాతం ఓట్లు లభించాయి. ఈ పార్లమెంట్‌ ఎన్నికలో పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకున్నా బీజేపీ రికార్డు స్థాయిలో ఓట్లను కొల్లగొట్టగలిగింది. మల్కాజిగిరి పార్లమెంట్‌లో బీజేపీకి 51.64శాతం ఓట్లు రాగా కాంగ్రె్‌సకు 31.24శాతం, బీఆర్‌ఎ్‌సకు 15.65శాతం చొప్పున ఓట్లు పడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మల్కాజిగిరి పార్లమెంట్‌ చరిత్రలో బీజేపీకి 3.91లక్షల పైచిలుక మెజార్టీ లభించింది. ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్‌ కూడా ఈ నియోజకవర్గానికి కొత్త వ్యక్తే అయినప్పటికీ జనం ఆయనకు ఓట్ల వర్షం కురిపించారు.

కాంగ్రెస్‌ కొంపముంచిన అభ్యర్థుల ఎంపిక

అధికార కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. అధికార పార్టీ అభ్యర్థులు బీజేపీ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. అభ్యర్థుల ఎంపికే దీనికి ప్రధాన కారణం. చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానాల నుంచి పోటీకి కాంగ్రెస్‌ సీనియర్లు కేఎల్లాఆర్‌తో పాటు మరికొందరు ఆసక్తి చూపినప్పటికీ బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన రంజిత్‌రెడ్డి, సునీతారెడ్డిలకు కాంగ్రెస్‌ నాయకత్వం టికెట్లు కేటాయించింది. దీన్ని కాంగ్రెస్‌ ముఖ్య నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కారణంగా ఎన్నికల సమయంలో వారు అభ్యర్థులకు పూర్తిస్థాయులో సహకరించలేదు. ఇదిలా ఉంటే తొలుత వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డిని చేవెళ్ల బరిలో దింపాలనే భావించారు. ఈ మేరకు ఆమె ప్రచారాన్ని కూడా మొదలు పెట్టారు. కానీ చివరి క్షణంలో ఆమెను మల్కాజిగిరికి పంపి చేవెళ్ల స్థానాన్ని బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డికి కేటాయించారు. దీని వల్ల కూడా చేవెళ్ల పార్లమెంట్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ చేతులారా పోగొట్టుకుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చేవెళ్ల నుంచి సునీతారెడ్డి పోటీ చేసి ఉంటే ఇక్కడ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉండేవి. సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డిపై స్థానికంగా వ్యతిరేకత కూడా ఎక్కువగానే ఉంది. దీంతో పాటు ఆయన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కాంగ్రెస్‌ నేతలపై కేసులు పెట్టి వేధించారనే ఆరోపణలూ ఉన్నాయి. దీంతో కాంగ్రె్‌సలో అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడమే కాకుండా ఎన్నికల్లో సహాయ నిరాకరణ చేశారు.

‘కొండా’ రెండో సారి గెలుపు

చేవెళ్లలో బీజేపీ తరుపున బరిలో దిగిన కొండా విశ్వేశ్వరెడ్డికి ఈ స్థానం నుంచి రెండో సారి విజయం లభించింది. 2014లో ఆయన టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆ పార్టీ నాయకత్వంతో పొసగక బయటకొచ్చిన ఆయన 2019లో కాంగ్రె్‌సలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి చేతలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో కొండా.. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన రంజిత్‌రెడ్డిపై విజయం సాధించి ప్రతీకారం తీర్చుకున్నారు.

ఈటలకు ఈ గెలుపు ప్రత్యేకం

దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి బీజేపీ తరుపున బరిలో దిగిన ఈటల రాజేందర్‌ ఘన విజయం సాధించారు. ఈ గెలుపు ఈటలకు ప్రత్యేకమనే చెప్పాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఈటలకు అధిష్టానం మల్కాజిగిరి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. దీంతో ఇక్కడ గెలుపు ఆయనకు సవాల్‌గా మారింది. అంతేకాదు మల్కాజిగిరి స్థానం సీఎం రేవంత్‌రెడ్డి సిట్టింగ్‌ సీటు కావడం గమనార్హం. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ స్థానం పరిధి అసెంబ్లీ సెగ్మెంట్లలో 3లక్షల పైచిలుకు మెజార్టీ సాధించిన బీఆర్‌ఎస్‌ కూడా బరిలో ఉంది. దీంతో మల్కాజిగిరి స్థానంలో గెలుపు కోసం ఈటల ఎంతో కష్టపడ్డారు. ముందు నుంచే వ్యూహాత్మకంగా ప్రచారాన్ని మొదలుపెట్టి ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అన్నీ కలిసివస్తే ఆయనకు కేంద్రంలో లేదా పార్టీలో కీలక పదవులు దక్కే అవశాలు మెరుగుపడ్డాయి.

అన్ని రౌండ్లలో ‘కొండా’దే ఆధిక్యం

చేవెళ్ల పార్లమెంట్‌ ఓట్ల లెక్కింపు ఉత్కంఠ బరితంగా సాగింది. ఉదయం 8గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కించారు. అనంతరం ఈవీఎంల లెక్కిపు కొనసాగింది. చేవెళ్ల పార్లమెంట్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపును రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల కలెక్టర్లు శశాంక, నారాయణరెడ్డిల పర్యవేక్షణలో నిర్వహంచారు. ఓట్ల లెక్కింపు రాత్రి 7గంటలకు ముగిసింది. 24 రౌండ్లలో ఓట్లను లెక్కించారు. మొదటి రౌండ్‌ నుంచి చివరి రౌండ్‌ వరకు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రత్యర్థి రంజిత్‌రెడ్డిపై ఆధిక్యాన్ని సాధించారు. చివరకు కొండా 1,72,897 మెజారిటీతో గెలిచారు. మొదటి రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు 10,079 ఓట్లు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి 42,568 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డికి 28,648 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్‌లో విశ్వేశ్వర్‌రెడ్డికి 13,920 ఓట్ల ఆధిక్యం వచ్చింది. రెండో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి 30,342 ఓట్ల లీడ్‌కు చేరారు. మూడో రౌండ్‌లో 46,641 ఓట్ల మెజారిటీ, నాలుగో రౌండ్‌లో 53,199 ఓట్లు, ఐదో రౌండ్‌లో 64,874, ఆరో రౌండ్‌ వచ్చేసరిగి రంజిత్‌రెడ్డిపై విశ్వేశ్వర్‌రెడ్డి 78,776 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. 7వ రౌండ్‌లో 90,205 ఓట్లు, 8వ రౌండ్‌లో 1,06,494 ఓట్లు, 9వ రౌండ్‌లో 1,31,527 ఓట్లు, 10వ రౌండులో 1,30,223 ఓట్లు, 11వ రౌండులో 1,25,104 ఓట్లు, 12వ రౌండ్‌ 1,10,352 ఓట్లు, 13వ రౌండులో 1,15,112 ఓట్లు, 14వ రౌండులో 1,16,769 ఓట్లు, లీడ్‌ వచ్చింది. 15వ రౌండు ముగిసే 1,14,953 ఓట్ల లీడ్‌ వచ్చింది. 16వ రౌండు ముగిసే వరకు 1,31,239 ఓట్లు, 17వ రౌండ్‌ 1,42,537ఓట్లు, 18వ రౌండ్‌ ముగిసే 1,47,394 ఓట్లు, 19వ రౌండు 1,56,515 ఓట్లు, 20వ రౌండు 1,62,149 ఓట్లు, 21వ రౌండు 1,64,958 ఓట్లు, 22వ రౌండు 1,66,139 ఓట్లు, 23వ రౌండ్‌ ముగిసే వరకు 1,67,778ఓట్లు, చివరి రౌండ్‌ 24వ రౌండ్‌ ముగిసే వరకు బీజేపీ 1,67,656 లీడ్‌ సాధించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!