ఆంధ్రప్రదేశ్చిన్నారిజాతీయంతెలంగాణమహిళరాజకీయంసినిమా

చార్‌ధామ్‌ చూసొద్దామా…!

Share This Post 🔥

చార్ ధామ్‌ యాత్ర… జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే నాలుగు పుణ్యక్షేత్రాల పర్యటన. పవిత్ర నదులుగా పిలిచే గంగ-యమునల జన్మస్థలాలైన గంగోత్రి, యమునోత్రి…

పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా దర్శనమిచ్చే కేదార్‌నాథ్‌… మహావిష్ణువు తపస్సు చేసిన దేవభూమిగా ప్రసిద్ధిపొందిన బద్రినాథ్‌ల సమాహారమే చార్‌ధామ్‌ యాత్ర. ఈ నాలుగు ఆలయాలూ ఏడాదిలో ఆరునెలలు మాత్రమే తెరిచి ఉంటాయనేది తెలిసిందే అయినా… తెలియని మరెన్నో ఆశ్చర్యకరమైన అంశాలు వీటివెనుక ఉన్నాయి.

వెండి వెలుగులతో మెరిసే మంచు శిఖరాలూ.. కొండలనుంచి జాలువారే జలపాతాలూ.. భగవన్నామాన్ని స్మరిస్తూ సాగే భక్తులూ… ఇలా ప్రకృతి రమణీయతా, ఆధ్యాత్మిక శోభా ఒకేచోట కనిపిస్తూ అలౌకికమైన ఆనందాన్ని కలిగిస్తుంది చార్‌ధామ్‌ యాత్ర. ఉత్తరాఖండ్‌లోని ఈ నాలుగు ఆలయాల ద్వారాలు తెరిచే సమయం కోసం ప్రపంచవ్యాప్తంగా వేలాది భక్తులు ఆతృతగా ఎదురుచూస్తారు.

యమునోత్రితో మొదలుపెట్టి గంగోత్రి, కేదార్‌నాథ్‌లకు వెళ్లి ఆఖరున బద్రీనాథ్‌ను దర్శించి ధన్యులవుతారు. ఏటా వేసవిలో తెరిచే ఈ ఆలయాల్ని ఆరు నెలలయ్యాక మూసేస్తారు. అప్పుడు దేవతామూర్తులను ఇతర ప్రాంతాల్లో ఉంచి మళ్ళీ ఏప్రిల్‌-మేకి తీసుకొస్తారు.

యమునానది ఆవిర్భావం ఇక్కడే

యమునోత్రి… ఈ యాత్రలో మొదట దర్శించుకునే క్షేత్రం. సూర్యుడి కుమార్తె అయిన యమున ఉత్తర కాశీలో అవతరించింది. భక్తులు ఈ నదిలో స్నానమాచరిస్తే ఆత్మ-దేహం పరిశుద్ధమవుతాయని నమ్ముతారు. ఈ ఆలయానికి దగ్గరగా సూర్యకుండ్‌, గౌరీ కుండ్‌ పేర్లతో నీటి చెలమలు కనిపిస్తాయి. సూర్యకుండ్‌లోని నీరు పొగలుకక్కుతూ ఉంటే గౌరీ కుండ్‌లో గోరువెచ్చగా అనిపిస్తాయి.

గౌరీకుండ్‌లో స్నానమాచరించి గర్భగుడిలో ఇతర దేవతలతో కలిసి ఉన్న యమునాదేవిని దర్శించుకుంటారు భక్తులు. దీపావళి రెండో రోజున వచ్చే యమ ద్వితీయ నాడు ఆలయాన్ని మూసేసి విగ్రహాన్ని ఖార్సాలీ అనే గ్రామానికి తరలిస్తారు. యమునాదేవి తల్లి అయిన సంజనాదేవి సూర్యుడి తాపాన్ని తట్టుకోలేక తన స్థానంలో ఛాయను ఉంచడంతో ఆమె సంజనాదేవి సంతానాన్ని (యమున- శని- యముడు) ఇబ్బందిపెట్టేదట. దాంతో అన్నదమ్ములిద్దరూ వెళ్లిపోయారట. ఆ వియోగంతో యమున విలపించిందనీ ఆ కన్నీరే నదిగా ప్రవహించిందనీ కథ.

గంగోత్రి… పాపహారిణి

గంగానదిలో స్నానమాచరిస్తే పాపాలు తొలగిపోతాయని అంటారు. చనిపోయిన వారి అస్థికలను గంగానదిలో కలిపేందుకు వారణాసి, గయ, ప్రయాగలతోపాటు ఇతర గంగాతీర్థాలకు చేరుకునేవారెందరో. ఇంతటి విశిష్టత కలిగిన గంగానది భూమిని తొలిసారి తాకిన ప్రదేశమే గంగోత్రి. భగీరథుడు తన పూర్వీకుల పాపాలను నిర్మూలించే క్రమంలో గంగను భూమి మీదకు రప్పించేందుకు తపస్సు చేయడంతో గంగాదేవి నది రూపాన్ని దాల్చింది. ఆ ప్రవాహ ఉధృతాన్ని అదుపుచేసేందుకు పరమేశ్వరుడు తన జటాజూటాన్ని అడ్డుపెట్టి తరువాత గంగానదిని వదిలాడట.

అలా వచ్చిన గంగమ్మకోసం భాగీరథీ నదీ తీరంలో నిర్మించిన ఆలయమే గంగోత్రి. ఇక్కడ గర్భగుడిలో గంగాదేవితోపాటు సరస్వతి, అన్నపూర్ణ, భగీరథుడు, తదితర విగ్రహాలుంటాయి. గంగాదేవి దర్శనానంతరం సమీపాన ఉన్న భగీరథ శిలనీ, భైరోనాథ్‌ ఆలయాన్నీ, రిషీకుండ్‌నీ చూసి తన్మయులవుతారు. ఈ గుడినీ దీపావళి తరవాత మూసేసి ముఖ్భా అనే గ్రామానికి దేవి విగ్రహాన్ని చేరుస్తారు.

ముక్తిధామం… కేదార్‌నాథ్‌

‘ఓం నమశ్శివాయ’ అని స్మరిస్తూ కేదార్‌నాథ్‌లో కొలువైన కేదారేశ్వరుడిని చూసేందుకు తపిస్తారు భక్తులు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ ఆలయం మందాకిని నది సమీపంలో రుద్రప్రయాగలో ఉంటుంది. ఇక్కడ శివలింగం రాయి రూపంలో కనిపిస్తుంది. పాండవులు – కౌరవులను సంహరించినందుకు పరిహారంగా శివుడిని దర్శించుకోవాలనుకున్నారట. అది ఇష్టపడని పరమేశ్వరుడు ఎద్దు రూపంలోకి మారి ఈ ప్రాంతంలోనే ఓ కొండపైన దాక్కున్నాడట. అయితే భీముడు ఓ ఎద్దు తోకను పట్టుకుని తన సోదరుల చెంతకు తీసుకెళ్లాలనుకున్నాడు. ఆ పనికి ప్రాయశ్చిత్తంగా పాండవులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. తరువాత ఈ ఆలయాన్ని పునరుద్ధరించిన జగద్గురువు శంకరాచార్యులు ఇక్కడే తన దేహాన్నీ విడిచాడు. ఈ ఆలయానికి పూజారిగా వ్యవహరించే రావల్‌ది కర్ణాటకకు చెందిన వీరశైవ కుటుంబ నేపథ్యం. కార్తిక పౌర్ణమి తరవాత దీన్ని మూసేసి స్వామిని ఉఖీమఠ్‌కు తీసుకెళ్తారు.

ఎనిమిదో వైకుంఠం… బద్రీనాథ్‌

దేవభూమి, ఎనిమిదో వైకుంఠం, శ్రీమన్నారాయణుడు నడయాడిన పవిత్ర క్షేత్రం… అంటూ కీర్తించే బద్రీనాథ్‌ ఆలయం ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో అలకనంద నది సమీపాన ఉంటుంది. శ్రీమహావిష్ణువు బదరీనారాయణుడి రూపంలో పూజలు అందుకుంటున్న ఈ ఆనంద నిలయాన్ని మానవులు ఆరునెలలూ, దేవతలు ఆరునెలలూ దర్శించుకుంటారట. ఇక్కడ పూజారిగా కేరళకు చెందిన నంబూద్రి కుటుంబానికి చెందిన బ్రాహ్మణుడినే నియమిస్తారు. ఇక, తలుపులు మూసే రోజున అఖండదీపాన్ని వెలిగించి, పూలూ ఉంచుతారు. విగ్రహాన్ని జోషిమఠ్‌లో ఉన్న నరసింహ ఆలయానికి చేరుస్తారు. గుడి తెరిచే సమయానికి అఖండదీపం వెలగడం, పూలు తాజాగా ఉండటాన్నీ చూడొచ్చు. ఇక్కడ బదరీనారాయణుడు- నరనారాయణులు, శ్రీదేవి-భూదేవి, ఇతర దేవతామూర్తులతో కనిపిస్తాడు.

విష్ణుమూర్తి ఈ ప్రాంతంలో బదరీ వృక్షం కింద తపస్సు చేయడంతో ఈ ప్రాంతానికీ, స్వామికీ ఆ పేరు వచ్చింది. ఈ విష్ణుమూర్తి విగ్రహాన్ని దేవతలు తయారుచేశారట. కొన్నాళ్లకు ఆ విగ్రహం అలకనందా నదిలో పడిపోవడంతో దాన్ని శంకరాచార్యులు వెలికి తీసి ఆలయాన్ని నిర్మించాడట. భక్తులు ముందుగా తప్తకుండ్‌ పేరుతో ఉండే వేడినీటి కొలనులో స్నానమాచరిస్తారు. అలాగే బ్రహ్మకపాల తీర్థంలో పితృదేవతలకు శ్రాద్ధకర్మలనూ నిర్వహించొచ్చు. వసుధార జలపాతంతోపాటు నారద తీర్థం వంటివాటిని దర్శించుకుని పరవశిస్తారు భక్తులు. ఈ చార్‌ధామ్‌ను దర్శించుకోవాలనుకునే భక్తులు ముందుగా ఉత్తరాఖండ్‌ రాష్ట్ర వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసుకోవాలి. ఇక్కడకు వెళ్లే వారు మార్గమధ్యంలో బస చేసేందుకు టెంట్లనూ అద్దెకు ఇస్తారు. ప్యాకేజీల ద్వారానూ ఈ నాలుగు ఆలయాలను దర్శించుకోవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!