Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

ఎవరి ధీమాలో వాళ్లు…!

Share This Post 🔥

10-12 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్‌ అంచనా… ముస్లిముల ఏకపక్ష పోలింగ్‌పై భరోసా.

పోల్‌ మేనేజ్‌మెంట్ లో ముందున్నామని విశ్లేషణ

9-10 గెలుస్తామంటున్న బీజేపీ వర్గాలు.

మోదీ క్రేజ్‌ గ్రామాల్లోనూ ఉందని విశ్వాసం

ఆరు గెలుచుకుంటామని బీఆర్‌ఎస్‌ అంచనా…

హైదరాబాద్‌ :       రాష్ట్రంలో లోక్‌సభ పోలింగ్‌ ముగిసింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన త్రిముఖ పోరులో విజయం ఎవరిదనే చర్చ అన్ని పార్టీల్లో మొదలైంది. మూడు పార్టీలూ ఫలితాల పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని, గత నవంబరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అదృష్టం కాదని నిరూపిస్తామని కాంగ్రెస్‌ ధీమాగా చెబుతోంది. సోమవారం సొంత గ్రామంలో ఓటేసిన సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమేనని పునరుద్ఘాటించారు. పది నుంచి 12 సీట్లు దక్కే అవకాశం ఉందని పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, ఆదిలాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌, మహబూబాబాద్‌, చేవెళ్ల సీట్లలో కాంగ్రెస్‌ కచ్చితంగా గెలుస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్‌ను వదిలేస్తే… సికింద్రాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, మల్కాజ్‌గిరీ సీట్లలో ప్రత్యర్థి పార్టీలతో గట్టి పోటీని ఎదుర్కొంటున్నట్లు వివరిస్తున్నాయి. సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరీ సీట్లలో ఓటర్లు సహజంగా అధికార పార్టీకి మెగ్గు చూపుతారని, ముస్లిం మైనార్టీలూ కాంగ్రెస్‌ అభ్యర్థులకే మద్దతుగా నిలిచిన నేపథ్యంలో రెండూ తమకే దక్కుతాయని అంచనా వేస్తున్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనితీరు పట్ల ఉన్నసానుకూలత, బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందన్న ప్రచారాలకు తోడు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీల్లో మెజారిటీ ఓటర్లు కాంగ్రె్‌సకు మద్దతుగా నిలవడడంతో కాంగ్రె్‌సకు సానుకూల పరిస్థితి స్పష్టంగా కనిపించిందని పార్టీ నేతలు చెబుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోనూ మోదీ క్రేజ్‌

రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలు తామే సాధించబోతున్నామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం పెరుగుతోందని, ఇది తమకు అనుకూలిస్తుందని అంటున్నారు. ఓటుబ్యాంకు భారీగా పెరుగుతోందని, 9-10 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ”పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తగ్గినా బీజేపీకిఆదరణ పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ మోదీ క్రేజ్‌ విస్పష్టంగా కనిపించింది” అని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు విశ్లేషించారు. ఒక ప్రధాన కులం ఈసారి పూర్తిగా తమ ప్రత్యర్థి వైపు మొగ్గు చూపినట్లు సమాచారం అందిందని, అయితే, దీని ప్రభావం పెద్దగా ఉండబోదని చెప్పారు. యువత పెద్దఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారని, మోదీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడం కలిసి వచ్చిందని చెబుతున్నాయి. ప్రధానిగా మోదీ మరోసారి కొనసాగాల్సిన అవసరాన్ని ప్రచారం చేశామని, యువత కూడా అనుకూలంగా స్పందించిందని తెలిపాయి.

ఓటింగ్‌ శాతం తగ్గదు: బీఆర్‌ఎస్‌

కనీసం ఆరు స్థానాల్లో గెలుపు తథ్యమని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ వైఫల్యాలు, కేంద్రంలో బీజేపీ తెలంగాణకు ఏమీ చేయడం లేదన్న అంశాలే ప్రధాన ఎజెండాగా బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించింది. మెదక్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, కరీంనగర్‌, నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి లోకసభ స్థానాల్లో గెలుస్తామని భావిస్తున్నట్లు తెలిసింది. ఓటింగ్‌ శాతం ఏ మాత్రం తగ్గదని అంచనా వేస్తున్నారు. మెదక్‌ ఏళ్ల తరబడి కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్న స్థానమని, అక్కడ గెలుపు తేలికేనని, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ పరిధిలో పార్టీ ఎమ్మెల్యేలు ఉండటం, సికింద్రాబాద్‌లో పార్టీ అభ్యర్థికి ప్రజల్లో ఎక్కువ ఆదరణ లభించడం కలిసివస్తాయని అంచనా వేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ నుంచి క్రాస్‌ ఓటింగ్‌

పోలింగ్‌ తేదీ నాటికి రాష్ట్రంలోని మెజారిటీ లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల మధ్యనే ముఖాముఖీ పోటీ నెలకొన్నట్లుగా వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఆయా స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఓట్లు భారీగా క్రాస్‌ అయినట్లు చెబుతున్నారు. ఒకటి, రెండు శాతం ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తున్న క్రమంలో క్రాస్‌ అయిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఓట్లు.. ఎవరి కొంప ముంచుతాయోనన్న ఆందోళన ఇటు కాంగ్రెస్‌, అటు బీజేపీ వర్గాల్లోనూ నెలకొంది. ముఖ్యంగా మల్కాజ్‌గిరీ, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూలు, జహీరాబాద్‌, నిజామాబాద్‌ వంటి చోట్ల క్రాస్‌ ఓటింగ్‌ భారీగా జరిగిందని చెబుతున్నారు. బీఆర్‌ఎ్‌సలోని కాంగ్రెస్‌ వ్యతిరేకులు బీజేపీ వైపు, బీజేపీ వ్యతిరేకులు కాంగ్రెస్‌ పార్టీకి క్రాస్‌ చేసినట్లూ వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో అధికార పార్టీతో మంచి కోసమూ కొందరు బీఆర్‌ఎస్‌ నేతలు.. కాంగ్రెస్‌ అభ్యర్థులకు క్రాస్‌ చేయడానికే మెగ్గు చూపినట్లూ చెబుతున్నారు. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ఉన్న వ్యక్తిగత పరిచయాలతోనూ క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందంటున్నారు. చేవెళ్ల నియోజకవర్గం తీసుకుంటే ఇటు కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, అటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు ఇద్దరూ గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలుగా పనిచేసిన వారే. ఆ పార్టీ నాయకులతో ఇద్దరికీ వ్యక్తిగత పరిచయాలు, ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో ఎవరికి వీలైనంతగా వారు బీఆర్‌ఎస్‌ ఓటింగ్‌ను తమవైపునకు తిప్పుకున్నట్లు చెబుతున్నారు.

బీఆర్‌ఎస్ కు భారీ దెబ్బ

ముక్కోణపు పోటీలు జరిగితే మెజారిటీ సీట్లలో రెండో ప్లేసు దక్కించుకునైనా ఉనికి నిలబెట్టుకోవాలని భావించిన బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆశలకు.. ఈ క్రాస్‌ ఓటింగ్‌ భారీగా గండి కొట్టినట్లు చెబుతున్నారు. మెజారిటీ సీట్లలో బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికి పడిపోనున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఉనికే ప్రమాదంలో పడేందుకూ ఆస్కారం ఉన్నట్లు చెబుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!