Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

నోటా కోసం కాంగ్రెస్ విస్తృత ప్రచారం. ఇండోర్ లో విచిత్ర పరిస్థితి…

Share This Post 🔥

ఎవరైనా పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తారు. వారి గెలుపునకు కృషి చేస్తారు. ప్రత్యర్థిని చిత్తుగా ఓడించాలని ఓటర్లకు పిలుపునిస్తారు. కానీ, ఇందౌర్‌లో కాంగ్రెస్‌ పార్టీది విచిత్ర పరిస్థితి.

నోటా తరఫున ఆ పార్టీ ఇప్పుడు వకల్తా పుచ్చుకుంది. నోటాకే ఓటేయాలని పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిస్తోంది.

మధ్యప్రదేశ్‌లో ఇండోర్ లోక్‌సభ స్థానంలో గత 35 ఏళ్లుగా గెలుపు అందని ద్రాక్షగానే మిగిలింది. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అభ్యర్థిని నిలుపుతూ వస్తోంది. కానీ, ఈసారి ఆ పార్టీ తరఫున అభ్యర్థిని కూడా బరిలో ఉంచలేని పరిస్థితి. ఇండోర్‌ నుంచి సిటింగ్‌ ఎంపీ శంకర్‌ లాల్వానీ భాజపా నుంచి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్‌ నుంచి అక్షయ్‌కాంతి బామ్‌ తొలుత బరిలో నిలిచారు. కానీ చివరి నిమిషంలో పోటీ నుంచి వైదొలిగారు. తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. పార్టీకి గుడ్‌బై చెప్పి ఏకంగా ప్రత్యర్థి పార్టీలో చేరిపోయారు. దీంతో భాజపా అభ్యర్థితో పాటు మరో 13 మంది బరిలో నిలిచారు.

హస్తం గుర్తుపై ప్రత్యామ్నాయ అభ్యర్థిని బరిలో నిలపాలని కాంగ్రెస్‌ భావించినా.. అందుకు హైకోర్టు అంగీకరించకపోవడంతో ఆ పార్టీ.. అనివార్యంగా పోటీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి నెలకొంది. బరిలో ఉన్న వారెవరికీ మద్దతు ప్రకటించకుండా.. కొత్త పల్లవి అందుకుంది. భాజపాకు బుద్ధి చెప్పాలంటే నోటాకు ఓటేయాలన్న ప్రచారం మొదలుపెట్టింది. తమ పార్టీ అభ్యర్థిని దొంగిలించిన భాజపాకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌ జీతూ పట్వారీ ఓటర్లను కోరారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన భాజపాకు దిమ్మతిరిగేలా బదులివ్వాలంటూ మరో సీనియర్‌ నేత శోభా ఓఝా పిలుపునిచ్చారు.

గత కొన్ని రోజులుగా ‘నోటా’ను కాంగ్రెస్‌ ఉద్ధృతంగా ప్రజల్లోకి తీసుకెళుతోంది. నోటాకు ఓటేయాలంటూ ‘సేవ్‌ డెమోక్రసీ’ పేరుతో ఆటోల వెనక పోస్టర్లు అతికిస్తోంది. సోషల్‌మీడియాలోనూ పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. ఇటీవల ఓ ఆటోపై ఉన్న పోస్టర్‌ను భాజపా కౌన్సిలర్‌ తొలగించడం వివాదాస్పదమైంది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది కూడా. మరోవైపు భాజపా.. కాంగ్రెస్‌పై కౌంటర్ అటాక్‌ మొదలుపెట్టింది. నోటాకు ఓటేయమని పిలుపిస్తూ.. ప్రజాస్వామ్యంపై ఆ పార్టీ దాడి చేస్తోందని ఆరోపించింది.

గతంలో ఇదే స్థానం నుంచి 8 సార్లు ఎంపీగా గెలుపొందిన లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఈ వ్యవహారంపై స్పందించారు. చివరి నిమిషంలో పోటీ నుంచి వైదొలగడం సరికాదని పేర్కొన్నారు. ఈ విషయమై ఇందౌర్‌లోని కొందరు ప్రముఖులు తనకు ఫోన్‌ చేసి భాజపా చేసింది తమకు నచ్చలేదని, తామూ నోటాకే ఓటేస్తామని చెప్పినట్లు ఆమె మీడియాకు చెప్పడం గమనార్హం. అయితే, పోటీలో ఉన్నది భాజపా అభ్యర్థి కాబట్టి ఓటేయాలని తాను అభ్యర్థించినట్లు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!