Uncategorized

అయోధ్య Complete Updates

Share This Post 🔥

అయోధ్య :: శ్రీరామ మందిరంలో ప్రాణప్రతిష్టను పురస్కరించుకుని అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 10 లక్షల దీపాలతో అలంకరించనున్నట్టు రామజన్మభూమి ట్రస్టు వెల్లడించింది.

రామాలయం, రామ్‌కీ పైడి, కనక్ భవన్, గుప్తర్ ఘాట్, సరయు ఘాట్, లతా మంగేష్కర్ చౌక్, మణిరామ్ దాస్ చవానీ, ఇతర ప్రముఖ ప్రదేశాలతో సహా ఏకంగా 100 ఆలయాల్లో ఈ దీపాలు వెలిగించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికోసం దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలను ఉపయోగించనున్నారు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సోమవారం సాయంత్రం సమయంలో ఇళ్లు, దుకాణాలు, వ్యాపార కార్యకాలయాల్లో దీపాలను వెలించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గడిచిన ఏడేళ్ల నుంచి అయోధ్యలో దీపోత్సవం నిర్వహిస్తోంది.

తొలుత 2017లో 1.71 లక్షల దీపాలతో దీన్ని ప్రారంభించారు. గతేడాది రికార్డు స్థాయిలో 22.23 లక్షల దీపాలను వెలిగించారు. సోమవారం రోజున ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 

అయోధ్యలో భద్రత కట్టుదిట్టం

13 వేల మంది బలగాలతో భద్రత

అయోధ్య రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశవ్యాప్తంగా పలు రంగాల్లోని ప్రముఖులు, సెలబ్రెటీలు, దౌత్యవేత్తలు, లక్షలాది మంది రామ భక్తులు అయోధ్యకు వస్తున్నారు.

ఈ నేపథ్యంలో అయోధ్య వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భద్రత కోసమ మల్టీ లెవల్ భద్రత ప్రణాళికలో భాగంగా నగరంలో 13,000 మంది బలగాలను మోహరించారు. రేపు ఈ మహత్తర కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, రజినీ కాంత్, చిరంజీవి, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వారు రాబోతున్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమై 1 గంటకు ముగుస్తుంది. ఈ వేడుకలకు మొత్తం వీవీఐపీలు, సాధువులతో కలిపి 7000 మందికి పైగా ప్రముఖులు వస్తున్నారు.

భద్రత కట్టుదిట్టం:

అయోధ్య ఎక్కడా చూసిన భద్రతే కనిపిస్తోంది. మొత్తం 13,000 మంది భద్రతను పర్యవేక్షిస్తున్నారు. యాంటీ బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను మోహరించారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) అయోధ్యలో క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇక ఉగ్రవాదుల నుంచి హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌(ఏటీఎస్)ని రంగంలోకి దింపింది. 24×7 పర్యవేక్షణ కోసం అయోధ్య అంతటా 10,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు. లతా మంగేష్కర్ చౌక్ వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) సిబ్బందిని మోహరించారు. సరయు నదిపై పోలీసులు తరచూ బోట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.

అయోధ్యలో కొత్తగా ప్రారంభించబడిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ప్రాణ్ ప్రతిష్ట’ కోసం భక్తులు, ప్రముఖులు నగరానికి రావడం ప్రారంభించడంతో యాంటీ బాంబ్, డాగ్ స్క్వాడ్‌లను మోహరించారు. వీవీఐపీల కదలికల సమయంలో ట్రాఫిక్‌ని నిర్వహించేందుక ప్రధాన కూడళ్లలో ముళ్ల కంచెను ఉపయోగిస్తున్నారు. నేరస్తుల కదలికను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు ఆర్టిఫిషియల్(AI) కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఇక అన్ని భద్రతా సంస్థలు రియల్ టైమ్‌లో సెక్యూరిటీని పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలోని 51 నిర్దేశిత ప్రదేశాలలో పార్కింగ్ ఏర్పాట్లు చేసింది. 22,825 వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు ఉంటాయి. ఈ ప్రదేశాలను నిరంతరం డ్రోన్‌లతో పర్యవేక్షిస్తుంటారు. రామమందిర శంకుస్థాపనకు వచ్చే అతిథుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు 51 స్థలాలను గుర్తించినట్లు ట్రాఫిక్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) బీడీ పాల్సన్ తెలిపారు. ఇక జీవ, రసాయన, అణు దాడుల్ని, భూకంపాల వంటి విపత్తులను ఎదుర్కొనేందుకు శిక్షణ పొందిన NDRF బృందాలు మోహరించబడ్డాయి

అయోధ్య రామ మందిర నిర్మాణంలో ఇనుము, ఉక్కు ఉపయోగించలేదు. ఎందుకో తెలుసా…?

అయోధ్య భవ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం యావత్ దేశంతో పాటు ప్రపంచంలోని హిందువులు, రామ భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, 7000 మందికి పైగా అతిథులు, లక్షల మంది ప్రజల మధ్య రామ్ లల్లా(బాల రాముడి) విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు యూపీ సర్కార్‌తో పాటు సెంట్రల్ భద్రతా ఏజెన్సీలు అన్నీ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి.

ఇదిలా ఉంటే రామ మందిర నిర్మాణంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఆలయం వెయ్యి సంవత్సరాలకు పైగా ఉండేలా నిర్మించినట్లు ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా చెప్పారు. శతాబ్ధాల పాటు ఈ నిర్మాణం నిలిచేలా సాంప్రదాయ భారతీయ నిర్మాణ శైలిని, సైన్స్‌ని జోడించి నిర్మించినట్లు తెలిపారు. ఈ నిర్మాణంలో భారతీయ సైంటిస్టులు, ఇస్రో టెక్నాలజీని కూడా వాడారు. నాగర్ శైలిలో చంద్రకాంత్ సోంపురా ఈ ఆలయ డిజైన్ రూపొందించారు. వాస్తు శాస్త్రాన్ని మిళితం చేసి రూపకల్పన చేశారు.

మొత్తం 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించారు. దాదాపుగా 57,000 చదరపు అడుగుల్లో మూడు అంతస్తుల్లో నిర్మాణం జరిగింది. ఆలయం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. ఇనుము, ఉక్కును ఆలయ నిర్మాణంలో వాడలేదు. ఇనుము జీవితకాలం కేవలం 80-90 ఏళ్లు ఉంటుందని అందుకే ఉపయోగించలేదని నృపేంద్ర మిశ్రా చెప్పారు. నాణ్యమైన గ్రానైట్, ఇసుక రాయి, పాలరాయి ఉపయోగించి, జాయింట్లలో సిమెంట్, సున్నపు మోర్టార్లను కూడా వాడకుండా.. లాక్ అండ్ కీ మెకానిజం వాడామని రూర్కీ లోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ రామంచర్ల చెప్పారు. 2500 ఏళ్ల కాలానికి వచ్చే భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మాణం జరిగినట్లు వెల్లడించారు.

ప్రాచీన కాలంలో ఆలయ ప్రాంతం సమీపంలో సరయు నది ప్రవహించిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో ఆలయ నిర్మిత ప్రాంతం దిగువన ఇసుక అస్థిరంగా ఉన్నట్లు విశ్లేషణల్లో తెలిసింది. దీంతో ఆలయ ప్రాంతంలో మట్టిని 15 మీటర్ల లోతు వరకు తవ్వి, ఆ ప్రాంతంలో 12-14 మీటర్ల లోతు వరకు ఇంజనీరింగ్ మట్టిని వేశారు. స్టీల్ రీ బార్లు ఉపయోగించలేదు. 47 లేయర్ల బేస్ వరకు దృఢమైన రాతిలాగా ఉండేలా పునాదిని వేశారు. దీనిపై 1.5 మీటర్ల మందంతో M-35 గ్రేడ్ మెటల్ లేని కాంక్రీట్‌ని పటిష్టంగా వేశారు. దక్షిణ భారత దేశం నుంచి వచ్చిన గ్రానైట్ రాయిని 6.3 మీటర్ల మేర పరిచారు.

ఇక పునాదిపై సందర్శకులకు కనిపించే భాగాన్ని రాజస్థాన్ నుండి సేకరించిన ‘బన్సి పహర్‌పూర్’ అనే పింక్ ఇసుకరాయితో రూపొందించబడింది. CBRI ప్రకారం, గ్రౌండ్ ఫ్లోర్‌లో మొత్తం 160 కాలమ్స్, మొదటి అంతస్తు 132 మరియు రెండవ అంతస్తు 74 ఉన్నాయి. ఇవన్నీ ఇసుకరాయితో తయారు చేశారు. గర్భగుడిలో రాజస్థాన్ మక్రానా మార్బుల్ అమర్చారు. తాజ్ మహల్‌ని కూడా ఇదే రాయితో నిర్మించారు.

2500 ఏళ్లు రిటర్న్ పిరియడ్ భూకంపాలను తట్టుకునేలా.. ఇంటర్ లాక్ టెక్నాలజీతో 1000 ఏళ్లు ఈ రామ మందిరం నిలవబోతోంది. బెంగుళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌లో పనిచేస్తున్న హెరిటేజ్ లోహాల ప్రత్యేకత కలిగిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ శారదా శ్రీనివాసన్ మాట్లాడుతూ… పూర్వ కాలాల్లో ఆలయ నిర్మాణ సంప్రదాయ శైలి పొడి రాతితో తయారు చేయబడింది, ఇనుము, ఉక్కు ఉపయోగించలేదు, ఆ తరువాత 12వ శతాబ్ధం నుంచి ఇనుము ఉపయోగం కనిపిస్తుందని చెప్పారు

ఆలయ నిర్మాణంలో అడగడుగున సవాళ్లు. అయినా అద్భుతం సృష్టించిన ఇంజనీర్లు.

దాదాపు 500 ఏళ్ల కల నెరవేరింది. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తైంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకీ అంతా సిద్ధమైంది. 2019లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన తరవాత మొదలైన మందిర నిర్మాణం ప్రారంభమైంది. మొత్తం మూడంతస్తుల్లో ఆలయ నిర్మాణం చేపట్టారు. ఇంకొన్ని పనులు మిగిలి ఉన్నాయి. మిగతా నిర్మాణ పనులు 2025 నాటికి పూర్తి కానున్నాయి. నగర శైలిలో దీన్ని నిర్మించారు. అయితే…ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇటీవలే నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. పనులు మొదలు పెట్టినప్పటి నుంచి చాలా సమస్యలు ఎదురయ్యాయని, వాటన్నింటినీ దాటుకుని విజయవంతంగా నిర్మాణాన్ని పూర్తి చేశామని వివరించారు. ఈ సమస్యల్లో మొదటికి కూలీల కొరత. గతేడాది నవంబర్లో తన పాడ్కాస్ట్లో ఈ విషయం చెప్పారు నృపేంద్ర మిశ్రా. దీపావళి సమయంలో చాలా మంది కూలీలు ఇళ్లకు వెళ్లిపోయారు. అప్పుడు కూలీలు దొరకడమే కష్టమైపోయింది. నిర్మాణ పనులు ఆలస్యమవుతాయేమోనని ఆందోళన చెందినట్టు చెప్పారు మిశ్రా. డిసెంబర్ 31 నాటికి అంతా పూర్తి చేయాలని అప్పటికే టార్గెట్ పెట్టుకున్నారు. మొత్తం 3,500 మంది కూలీలు అప్పటికి అందుబాటులో ఉన్నారు. L&T సంస్థ నిర్మాణ పనులు చేపట్టగా…TATA సంస్థ వీటిని పర్యవేక్షించింది. కూలీలను రిక్రూట్ చేసుకునే బాధ్యతని L&T సంస్థే తీసుకుంది. అక్కడ ఒక్కో పనికి ఒక్కో నైపుణ్యం ఉన్న కూలీలు కావాల్సి ఉంటుంది. రాళ్లను ఎత్తడానికి రాజస్థాన్ నుంచి, వాటిని ఒకదానిపై ఒకటి పేర్చడానికి ఒడిశా నుంచి కూలీలను రప్పించారు. మొత్తంగా గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ నుంచే ఎక్కువగా పని చేశారు.

మట్టితోనే అసలు సమస్య…

ఆలయ నిర్మాణం జరిగిన ప్రాంతంలో మట్టి స్థిరంగా లేదు. వందల ఏళ్ల క్రితం ఇక్కడ సరయూ నది ప్రవహించడం వల్ల ఇంకా అక్కడి మట్టిలో ఆ వదులుదనం ఉన్నట్టు వివరించారు మిశ్రా. నిర్మాణం చేపట్టే క్రమంలో ఇంజనీర్లు ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు ఇదే. ఆ సమయంలోనే IIT చెన్నై సహకారం తీసుకున్నారు. 15 మీటర్ల లోతు వరకూ మట్టిని తవ్వి దాన్ని తొలగించి అక్కడ re-engineered soilతో నింపాలని సూచించారు. ఇదే 14 రోజుల తరవాత గట్టి పడుతుందని చెప్పారు ఎక్స్పర్ట్లు. వాళ్లు చెప్పినట్టుగానే అది రాయిలా తయారైంది. దానిపైనే నిర్మాణం మొదలు పెట్టారు. ఆ తరవాత అసలైన సవాలు…ఆలయం ఎన్నేళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించడం. ముఖ్యంగా భూకంపాలను తట్టుకుని నిలబడిగేలా తీర్చి దిద్దడం. అందుకోసం…Central Building Research Institute (CBRI) సలహాలు తీసుకున్నారు. ఇప్పటి వరకూ నమోదైన భూకంపాలకు 50 రెట్లు ఎక్కువగా ప్రకంపనలు వచ్చినా కొంచెం కూడా కదలకుండా పటిష్ఠంగా నిర్మించేలా సూచనలు చేశారు. ల్యాబ్లో సిమ్యులేషన్ చేసిన తరవాత పునాదిని భూకంపాలను తట్టుకునేలా నిర్మించారు. అందుకే..వెయ్యేళ్లైనా సరే చెక్కు చెదరదని అంత ధీమాగా చెబుతున్నారు. ఈ సవాళ్లన్నీ దాటుకుని అయోధ్య రామ మందిరం అత్యంత సుందరంగా తయారైంది.


.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!