ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

పాకిస్థాన్‌కు చెప్పిన తర్వాతే… బాలాకోట్‌ పై దాడులు.. మోదీ కీలక వ్యాఖ్యలు..

Share This Post 🔥

సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019 సార్వత్రిక ఎన్నికల ముందు పాకిస్థాన్‌ (Pakistan) భూభాగంలోని బాలాకోట్‌లో భారత్‌ జరిపిన వైమానిక దాడులు (Balakot Air Strikes) యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.

పుల్వామా దాడికి ప్రతీకారంగా ముష్కరులకు మన వాయుసేన ముచ్చెమటలు పట్టించింది. తాజా ఎన్నికల్లోనూ ఈ ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ దాడులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. బాలాకోట్‌పై వైమానిక దాడుల గురించి పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చిన తర్వాతే మీడియాకు వెల్లడించామన్నారు.

కర్ణాటకలోని బగల్‌కోట్‌ ఎన్నికల ప్రచారంలో మోదీ ఈ ఘటనను ప్రస్తావించారు. ”ఇది నవ భారత్‌. మనకు హాని తలపెట్టే ముష్కరులు వారి సొంత దేశంలో నక్కినా వేటాడి మరీ చంపేస్తాం. వెనుక నుంచి దాడి చేయడంపై మోదీకి నమ్మకం లేదు. శత్రువుతో ఎదురుగా నిలబడే పోరాడుతాం. 2019 నాటి బాలాకోట్‌ దాడుల సమాచారాన్ని దాయాది నుంచి దాచిపెట్టాలనుకోలేదు. దాడి తర్వాత అక్కడ జరిగిన విధ్వంసాన్ని శత్రువుకు ముందుగా చెప్పాం” అని ప్రధాని తెలిపారు.

”బాలాకోట్‌ వైమానిక దాడుల గురించి మీడియాను పిలిచి వెల్లడించాలని నేను మన బలగాలకు చెప్పా. అయితే, అంతకంటే ముందు పాకిస్థాన్‌కు ఈ విషయం చెప్తానన్నా. ఆ రోజు రాత్రి దాయాది దేశ అధికారులకు ఫోన్‌ చేస్తే వారు అందుబాటులోకి రాలేదు. అందుకని.. బలగాలను మరికొద్ది సేపు వేచి ఉండమన్నా. పాక్‌కు దీని గురించి చెప్పిన తర్వాతే.. ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాం. మోదీ దేన్నీ దాచిపెట్టడు. ఏది చేసినా బహిరంగంగా చేస్తాడు” అని నాటి సంఘటనలను ప్రధాని వివరించారు.

2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను జైషే ఉగ్రవాదులు బలితీసుకున్న విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత వాయుసేన ఫిబ్రవరి 26న వైమానిక దాడులు చేపట్టింది. పాక్‌ భూభాగంలోని బాలాకోట్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరాలపై తెల్లవారుజామున బాంబుల వర్షం కురిపించింది. ఉగ్రవాదాన్ని తాము ఎన్నటికీ సహించబోమని ఈ ఘటనతో భారత్‌.. పాక్‌ సహా ప్రపంచదేశాలకు గట్టి సందేశమిచ్చింది.

కాగా.. బాలాకోట్‌ ఘటన జరిగిన రోజే ఉదయం పాక్.. భారత్‌పై ప్రతిదాడికి దిగింది. మన గగనతలంలోకి వారి యుద్ధ విమానాలు దూసుకొచ్చాయి. అయితే పాక్‌ చర్యను భారత వాయుసేన సమర్థంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో మన మిగ్‌ విమానం ఒకటి కూలి వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ శత్రుచెరలో చిక్కుకుపోయారు. అయితే అంతర్జాతీయ ఒత్తిడితో మూడు రోజుల తర్వాత అభినందన్‌ను పాక్‌ విడిచిపెట్టింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!