ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

4 నెలల్లో 1,770 కోట్లు లూటీ… 5 నెలల్లో 8 లక్షల సైబర్ కేసులు నమోదు…

Share This Post 🔥

దేశంలో సైబర్‌ నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. గడిచిన ఐదు నెలల్లోనే సుమారు ఎనిమిది లక్షలకు పైగా సైబర్‌ కేసులు నమోదయ్యాయి.

గత మూడేండ్లుగా దేశంలో పౌరులు సైబర్‌ నేరాల బారిన పడటం పెరుగుతున్నది. సైబర్‌ నేరాల్లో యూపీఐ, క్రెడిట్‌కార్డు, పార్ట్‌టైమ్‌ జాబ్‌ మోసాలు అత్యధికంగా ఉన్నట్టు లోకల్‌ సర్కిల్స్‌ సర్వే నివేదికలు వెల్లడించాయి.

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 43 శాతం మంది తాము, తమ కుటుంబసభ్యులు క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవీల్లో మోసపోయామని, 36 శాతం మంది యూపీఐ లావాదేవీల్లో నష్టపోయామని తెలిపారు. పట్టణ ప్రజల్లో ఎక్కువశాతం పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల పేరిట పంపిన లింక్‌లు, క్యూఆర్‌కోడ్‌లకు డబ్బులు చెల్లించి మోసపోయినట్టు సర్వే తెలిపింది.

దేశవ్యాప్తంగా 302 జిల్లాల నుంచి కొన్ని వేల మందిని సర్వే చేయగా ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అన్ని పనులకూ ఆన్‌లైన్‌ వేదిక కావడం, అక్కడ పౌరుల డాటాను రక్షించే సరైన వ్యవస్థ లేకపోవడంతో పాన్‌కార్డ్‌, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌, చిరునామా వంటి వ్యక్తిగత సమాచారం విరివిగా లభిస్తున్నది.

ఆ డాటా ఆధారంగా ఆర్థిక మోసగాళ్లు సులభంగా ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని లోకల్‌ సర్కిల్స్‌ సర్వే వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ మోసాలు రికార్డు స్థాయిలో 300 శాతం పెరిగినట్టు సర్వే తెలిపింది. మొత్తంగా గత రెండేండ్లలో సైబర్‌ మోసాలు 700 శాతం పెరిగాయని వెల్లడించింది.

రోజుకు రూ.14 కోట్ల మోసాలు..!
దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్‌ మోసాల ద్వారా నేరగాళ్లు రోజుకు సుమారు 14 కోట్ల రూపాయలను అమాయకుల నుంచి కొల్లగొడుతున్నారు. అంటే ఏడాదికి సుమారు రూ.5వేల కోట్లను వివిధ పద్ధతుల్లో దోచుకుంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం గత జనవరి నుంచి ఏప్రిల్‌ చివరి వరకు నాలుగు నెలల్లో రూ.1,770 కోట్లను సైబర్‌ నేరగాళ్లు దోచుకున్నారు. గడిచిన ఐదేండ్లలో, ఈ ఏడాది ఏప్రిల్‌ చివరి నాటికి సుమారు 40 లక్షల సైబర్‌ నేరాలు నమోదయ్యాయి.

తెలంగాణలో ఏటా రూ.1450 కోట్లు.
సైబర్‌ నేరాల వల్ల ఒక్క తెలంగాణలోనే రోజుకు సుమారు రూ.4కోట్ల చొప్పున.. ఏడాదికి సుమారు రూ.1,450 కోట్ల డబ్బును సైబర్‌ నేరగాళ్లు దోచేస్తున్నారు. ఈ ఏడాది మూడు నెలల్లో నమోదైన టాప్‌-5 సైబర్‌ నేరాల్లో బిజినెస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్‌ టాప్‌లో ఉంది. బెట్టింగ్‌లకు వ్యసనపరులైన వారిని గుర్తించి.. వారికి ఈజీ మనీని పరిచయం చేసి, అక్కడ బిజినెస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వైపు మళ్లిస్తున్నట్టు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. రూ.1000 నుంచి ఇన్వెస్ట్‌మెంట్‌ పెట్టించి.. రూ.లక్షలు, కోట్లలో మోసం చేస్తున్నారని చెప్తున్నారు.

తర్వాతి స్థానాల్లో ఓటీపీ ఫ్రాడ్స్‌, అడ్వైర్టెజమెంట్‌ ఫ్రాడ్స్‌ (ఓఎల్‌ఎక్స్‌), ఫెడ్‌ఎక్స్‌ కొరియర్‌ సర్వీసెస్‌, సెక్స్‌టార్షన్‌ వంటివి టాప్‌-5 నేరాల్లో ఉన్నట్టు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. కాగా గతంలో విపరీతంగా పెరిగిన సెక్స్‌టార్షన్‌ మోసాలు.. ప్రస్తుతం తెలంగాణలో తగ్గుముఖం పట్టినట్టు వెల్లడించారు. ఎవరైనా సైబర్‌ నేరానికి గురయ్యామని తెలిసిన వెంటనే (గోల్డెన్‌ అవర్‌) 1930కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కోరుతున్నారు. ప్రతిరోజూ కొత్త తరహాలో చేస్తున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

దేశంలో గత ఐదేండ్లలో నమోదైన కేసులు
ఏడాది : కేసులు
2020 : 2,55,777
2021 : 4,52,414,
2022 : 9,56,790,
2023 : 15,56,215
2024 : 7,40,957
(ఏప్రిల్‌ నాటికి)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!