ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏఎస్పీ భుజంగరావు, అడిషనల్ డీసీపీ తిరుపతన్న అరెస్ట్

Share This Post 🔥

అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్‌రెడ్డి, ఆయన బంధువుల ఫోన్లు ట్యాప్‌

ఇండ్లకు 2 కి.మీ. దూరంలో ట్యాపింగ్‌ సెంటర్లు

ఎమ్మెల్యేల కొనుగోలు, బై ఎలక్షన్స్‌లో సీక్రెట్‌ ఆపరేషన్స్

ఇంటెలిజెన్స్ వాహనాల్లోనే డబ్బు తరలించినట్టు గుర్తింపు.

రాష్ట్రంలో ఫోన్ ల ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారు. భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ (గతంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ) ఎన్. భుజంగరావును, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ తిరుపతన్న(గతంలో ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ)ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీళ్లిద్దరూ తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ లను ట్యాప్ చేయడం, సాక్షాల ను ధ్వంసం చేయడంలో పాత్ర పోషించినట్టుగా విచారణలో అంగీకరించారని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీసు వెల్లడించింది.

వీరిద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టి, జ్యుడీషియల్ కస్టడీని కోరతామని పేర్కొంది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు టీంతో కలిసి వీరు అనధికారికంగా ప్రముఖుల వ్యక్తిగత ఫోన్లను ట్యాప్ చేశారని, ట్యాపింగ్ డివైస్ లతో పాటు హార్డ్ వేర్ లను ధ్వంసం చేశారని పోలీసులు గుర్తించారు.

రేవంత్ రెడ్డి ఇంటికి 2 కి.మీ. దూరంలో...

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్‌ రెడ్డి, ఆయన సోదరుల ఇండ్ల పరిసర ప్రాంతాల్లో ప్రణీత్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. సుమారు 2 కి.మీ. పరిధిలోని ప్రైవేట్ కమర్షియల్ బిల్డింగ్స్‌లో అత్యాధునిక టెక్నాలజీతో ట్యాంపింగ్ పరికరాలు అమర్చినట్లు స్పెషల్‌ టీమ్‌ గుర్తించినట్టు తెలిసింది.

బై ఎలక్షన్స్‌లో ఇంటెలిజెన్స్‌ వాహనాల్లోనే డబ్బు సైతం తరలించినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి శనివారం భుజంగరావుతోపాటు తిరుపతన్నను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని దాదాపు 7 గంటలపాటు విచారించారు. ఆ తర్వాత రాత్రి అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. వీరిద్దరితోపాటు అప్పటి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌ ప్రభాకరావు సహా మరో 8 మందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.

విచారణలో ప్రణీత్‌రావు వెల్లడించిన వివరాల ఆధారంగా ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, అప్పటి డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు ఫోన్‌ ట్యాపింగ్‌, సాక్ష్యాల ధ్వంసంలో పాత్ర ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం ఈ ముగ్గురి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ప్రభాకర్‌రావు విదేశాల్లో ఉండడంతో భుజంగరావు, తిరుపతన్నకు నోటీసులు అందించారు. స్పెషల్‌ టీమ్‌ నోటీసులతో భుజంగరావు, తిరుపతన్న శనివారం ఉదయం బంజారాహిల్స్‌ పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ వెంకటగిరి వీరిని ప్రశ్నించారు.

ఇంటెలిజెన్స్ చీఫ్‌ ఆదేశాలతోనే…

భుజంగరావు, తిరుపతన్న గతంలో ఎస్‌ఐబీ అడిషనల్‌ ఎస్పీలుగా పనిచేశారు. భుజంగరావు ఇంటెలిజెన్స్‌లో పొలిటికల్‌ వింగ్‌లో కీలకంగా వ్యవహరించారు. వీరిద్దరు గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌ రావు ఆధ్వర్యంలో సీక్రెట్ ఆపరేషన్స్‌ చేశారు. ప్రధానంగా అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్‌రెడ్డి సహా ప్రముఖ రాజకీయ నాయకులపై నిఘా పెట్టినట్టు తెలిసింది. ఇలా 2019లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్‌, మునుగోడు, హుజూరాబాద్‌, దుబ్బాక ఉప్ప ఎన్నికలు సహా బీఆర్‌ఎస్‌కు ప్రతికూల పరిస్థితి ఉన్న నియోజకవర్గాలను టార్గెట్‌ చేశారని.. ఆయా జిల్లాలు, నియోజకవర్గాలకు చెందిన ప్రతిపక్షనేతలను తమ ట్యాపింగ్ రాడార్‌లోకి తెచ్చుకున్నారని దర్యాప్తులో తేలినట్టు సమాచారం.

ఇంటెలిజెన్స్ వాహనాల్లోనే డబ్బు తరలింపు

ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబసభ్యులు,ఆఫీస్ సిబ్బంది ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు స్పెషల్‌ టీమ్‌ గుర్తించింది. బీఆర్‌ఎస్ ప్రత్యర్థుల కదలికలు, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, డబ్బు తరలింపునకు సంబంధించిన సంభాషణలను తెలుసుకు ని ఇల్లీగల్ ఆపరేషన్స్ చేసినట్లు తెలిసింది. పార్టీ ప్రచారం కోసం డబ్బు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారనే పక్కా వివరాలతో రెయిడ్స్ చేసినట్లు సమాచారం.

ఈ సోదాల్లో భుజంగ రావు, తిరుపతన్న సహా మరో ఐదుగురు అధికారులు కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. గతంలో జరిగిన ఎలక్షన్స్‌, బై ఎలక్షన్స్‌కి ఇంటెలిజెన్స్‌ వాహనాల్లోనే డబ్బు లు తరలించినట్లు స్పెషల్‌ టీమ్‌ దర్యాప్తులో తేలిందని సమాచారం. ఎమ్మెల్యేల కొనుగో లు వ్యవహారాన్ని కూడా ఫోన్‌ ట్యాపింగ్ ద్వారానే పసిగట్టి ట్రాప్ చేసినట్లు తెలిసింది. ప్రణీత్‌రావు అందించిన సమాచారం ఆధారంగానే ఇంటెలిజెన్స్‌లో అప్పుడు కీలక హోదాల్లో పని చేసిన ఆఫీసర్ల అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టు చెప్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!