ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

నాకు టచ్‌లో 20 మంది ఎమ్మెల్యేలు : కేసీఅర్

Share This Post 🔥

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెస్తానంటే ఇప్పుడే వద్దన్నా,

ఎన్నికల తర్వాత రాజకీయాల్లో మార్పులు.

బీజేపీ, కాంగ్రెస్‌ కొట్లాటతో రాజకీయ అనిశ్చితి

త్వరలో ఉద్యమకాలంనాటి కేసీఆర్‌ను చూస్తారు.


ఢిల్లీ మద్యం కుంభకోణం ఉత్తదే.. కక్ష సాధింపు

బీఎల్‌ సంతోష్‌ను అరెస్టు చేయాలని ప్రయత్నించాం

దానికి మోదీ కక్షకట్టి కవితను అరెస్టు చేయించారు

పటిష్ఠ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్నే కూల్చాలని చూశారు

65 సీట్లతో ఉన్న కాంగ్రెస్‌ సర్కారును కూల్చరా..?

బీజేపీలోకి రేవంత్‌ వెళ్లకపోవచ్చు.. ఒకవేళ వెళ్లినా వృధానే…

ఆయన వెంట ఎమ్మెల్యేలు వెళ్లకపోవచ్చు: కేసీఆర్‌

అభ్యర్థులకు బీఫారాలు.. రూ.95 లక్షల చెక్కులు

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులైనా చోటుచేసుకోవచ్చని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ కొట్లాటతో రాజకీయ అనిశ్చితి నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారని అన్నారు. దీనిని తట్టుకొని రాష్ట్రం అస్థిరతకు లోనుకాకుండా ఉండాలంటే బీఆర్‌ఎస్‌ బలంగా ఉండాలని ఆకాంక్షించారు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొందరు.. ఆ పార్టీ తీరు నచ్చక తిరిగి వస్తామని అడుగుతున్నారని, వారిని తిరిగి తీసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ”అధికారం ఉందని కాంగ్రెస్ లోకి వెళ్తే అక్కడంతా బీజేపీ కథ నడుస్తోందని ఓ నాయకుడు నాతో వాపోయారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్‌… అని ఓ సీనియర్‌ కీలక నేత నన్ను సంప్రదించారు. ఇప్పుడే వద్దని వారించాను” అని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులు, పార్టీ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్‌లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వడంతోపాటు ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ”కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గట్టిగా పోరాడితే లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయి. రాష్ట్రంలో భవిష్యత్‌ బీఆర్‌ఎస్ దే. త్వరలో ఉద్యమ కాలం నాటి కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలు చూస్తారన్నారు. ఇప్పటి వరకు 8 లోక్‌సభ సీట్లలో గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయని, మరో మూడు స్థానాల్లోనూ విజయావకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

మోదీ దుర్మార్గుడు

”ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ అంతా ఉత్తదే. అందులో ఏమీ లేదు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చీల్చడానికి ప్రయత్నించిన బీఎల్‌ సంతోష్ ను అరెస్ట్‌ చేయడానికి ప్రయత్నించడంతో మోదీ మనపై కక్ష కట్టారు. అందుకే అక్రమంగా లిక్కర్‌ కేసులో ఇరికించి కవితను అరెస్ట్‌ చేయించారు. ఇది కక్షసాధింపు చర్యే” అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కవిత అరెస్టుపై ఆయన స్పందించడం లేదంటూ రాజకీయ వర్గాల్లో దుమారం రేగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు కేసీఆర్‌ స్పందించారు. మోదీ దుర్మార్గుడని, విపక్ష నేతలపై కక్ష గట్టి అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ”ఎంఐఎంతో కలుపుకొని 111 సీట్లతో పటిష్ఠంగా ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు బీజేపీ చేసింది. అలాంటిది 65 మందితో అత్తెసరు మెజార్టీతో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చకుండా వదులుతుందా? కాంగ్రెస్‌ ముక్త భారత్‌ నినాదంతో ముందుకెళుతున్న మోదీ కాంగ్రెస్‌ ప్రభుత్వాలను ఖతం చేస్తున్నారు. ఏవో కుయుక్తులు పన్ని ఇక్కడి సర్కారును కూలదోయకుండా ఉంటారా? అన్న అనుమానం సర్వత్రా వ్యాపిస్తోంది. బీజేపీతోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ముప్పు ఉంటుంది” అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. రేవంత్‌ రెడ్డి బీజేపీలోకి వెళ్లకపోవచ్చునని, ఒకవేళ వెళ్లినా.. ఆయన వెంట కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెళ్లే పరిస్థితి లేదని అన్నారు. అయినా.. బీజేపీ వదిలిపెట్టదని, ఎమ్మెల్యేలను చీల్చి.. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

22 నుంచి బస్సు యాత్ర

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రజలను కలుసుకునేలా బస్సు యాత్ర చేస్తానని కేసీఆర్‌ చెప్పారు. ప్రచారంతోపాటు పంట నష్టపోయి అవస్థ పడుతున్న రైతన్నలను ఓదార్చేందుకు ఈనెల 22 నుంచి బస్సు యాత్ర చేపడతానని వెల్లడించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రెండు, మూడు అసెంబ్లీ ఏరియాల్లో రోడ్‌ షోలు ఉంటాయన్నారు. రోజుకు రెండు, మూడు రోడ్‌ షోలు ఉంటాయని, ఉదయం పంట పొలాలను పరిశీలించి.. రైతుల సమస్యలు తెలుసుకుని, సాయంత్రం రోడ్డు షోలు, కార్నర్‌ మీటింగ్‌లు చేపడతామని వివరించారు. వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నామని చెప్పారు. మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయిందని అబద్ధాలు, కట్టుకథలతో ప్రజలను ఇన్నాళ్లు మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. కాఫర్‌ డ్యామ్‌ కట్టాలని నిర్ణయించటం బీఆర్‌ఎస్‌ సాధించిన విజయమన్నారు. కొందరు నేతలు పార్టీని వీడినంత మాత్రాన బీఆర్‌ఎస్ కు నష్టం ఏమీ లేదని, భవిష్యత్‌లో బుల్లెట్లలాంటి యువ నాయకులను తీర్చిదిద్ది.. ఎమ్మెల్యేలుగా తీసుకొస్తామని అన్నారు. మళ్లీ వస్తామంటూ కడియం, దానం కాళ్లు పట్టుకున్నా తీసుకోబోమన్నారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి బీఆర్‌ఎస్ కు ప్రజల్లో ఆదరణ పెరిగిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. రైతు సమస్యలపై బీఆర్‌ఎస్‌ చేపట్టిన పోస్టు కార్డు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని, ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో లక్ష పోస్టుకార్డులు రాయాలని సూచించారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నాలుగు నెలలకే విసిగి వేసారిపోయారని అన్నారు.

బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ ఖాతాకు 10 కోట్లు

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం భయబ్రాంతులకు గురి చేస్తోందని, ఇటువంటి సంఘటనలను తిప్పి కొడదామని కేసీఆర్‌ అన్నారు. కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పై పోరాడేందుకు లీగల్‌ సెల్‌ను పటిష్ఠం చేశామని, ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా కార్యకర్తలకు కాపాడుకుంటామని, ఇందుకు గాను బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ అకౌంట్‌కు రూ.10 కోట్లు కేటాయించామని వెల్లడించారు. సమావేశంలో 17 మంది ఎంపీ అభ్యర్థులతోపాటు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్యులు పాల్గొన్నారు.

నదీజలాల మళ్లింపునకు బీజేపీ కుట్ర

తెలంగాణకు దక్కాల్సిన గోదావరి నది జలాలను ఇతర రాష్ట్రాలకు మళ్లించాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని, బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పునకు విరుద్ధంగా ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్ట్‌ కట్టి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నీళ్లు మళ్లించే ప్రయత్నం చేస్తోందని కేసీఆర్‌ ఆరోపించారు. ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన నీళ్లు పోగా మిగిలిన నీరంతా దిగువ రాష్ట్రమైన తెలంగాణకు దక్కాలని బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పులో స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. ఇది అసమర్థత కాదా? అని నిలదీశారు. బీజేపీని నిలదీయటానికి వంద కారణాలున్నాయని, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వాటన్నింటినీ ప్రజలకు వివరించేందుకు సోషల్‌ మీడియాను వినియోగించుకొని, ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలన్న ప్రశ్నను లేవనెత్తాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!