ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

తెలంగాణ ఉద్యమకారుడికి ఛాన్స్…

Share This Post 🔥

వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా సుధీర్‌కుమార్‌.

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయం

తెలంగాణ ఉద్యమకారుల హర్షం

ఎంపీ స్థానం గెలుపుపై ముఖ్యనేతల భేటీ

ఎన్నికల వ్యూహంపై కేసీఆర్‌ మార్గదర్శనం.

ఉద్యమకారులకు అన్నింటా గుర్తింపునిస్తున్న బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి, పార్టీకి విధేయుడిగా ఉన్న మారెపల్లి సుధీర్‌కుమార్‌కు వరంగల్‌ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. ఈమేరకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శుక్రవారం ఉమ్మడి జిల్లా పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి, వారి ఏకగ్రీవ ఆమోదంతో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి పట్టున్న వరంగల్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో విజయావకాశాలు సానుకూలంగా ఉన్నాయని, అందరూ సమన్వయంతో పనిచేసి ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషిచేయాలంటూ కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

గెలుపు వ్యూహం

వరంగల్‌ లోక్‌సభ ఎన్నికలో బీఆర్‌ఎస్‌ గెలుపునకు అనుసరించే వ్యూహంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ముఖ్యనేతలతో శుక్రవారం చర్చించారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీకి పట్టున్న వరంగల్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో గెలుపునకు పూర్తి సానుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరుగుతున్నదని, ముఖ్యంగా రైతులు అసంతృప్తిగా ఉన్నారని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చెప్పారు. బీఆర్‌ఎస్‌ పాలనను, కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్‌, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్‌, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్‌ సమావేశంలో పాల్గొన్నారు.

భారత రాష్ట్ర సమితి మరోసారి తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇచ్చింది. వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థిగా డాక్టర్‌ మారెపల్లి సుధీర్‌కుమార్‌ను పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. ప్రస్తుతం హనుమకొండ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఉన్న సుధీర్‌ తెలంగాణ సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. మలిదశ ఉద్యమంలో ఉద్యమనేత కేసీఆర్‌ వెంట నడిచారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన సుధీర్‌కుమార్‌ మొదటినుంచీ బీఆర్‌ఎస్‌లో కీలకంగా ఉన్నారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడిగా, కేసీఆర్‌తో కలిసి పనిచేస్తున్న సుధీర్‌కుమార్‌ సరైన అభ్యర్థిగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈమేరకు అందరితో చర్చించి వారి సలహా, సూచనల మేరకు అధినేత కేసీఆర్‌, సుధీర్‌కుమార్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు. వరంగల్‌ లోక్‌సభ ఎన్నికల బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సుధీర్‌కుమార్‌ను ఎంపిక చేయడంపై తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో మొదటినుంచీ కీలకంగా ఉన్న సుధీర్‌కుమార్‌ ఉమ్మడి కరీంనగర్‌ జడ్పీ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూరుకు చెందిన సుధీర్‌కుమార్‌ జిల్లాల పునర్విభజనలో హనుమకొండ జిల్లా పరిధిలోకి వచ్చారు. ఎల్కతుర్తి జడ్పీటీసీగా గెలిచి జడ్పీ చైర్మన్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రాజకీయ అనుభవం..

27-04-2001 టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యత్వం
1995-2000 మండల పరిషత్‌ అధ్యక్షుడు, భీమదేవరపల్లి
2001-2006 ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షుడు
ప్రస్తుతం హనుమకొండ జిల్లా పరిషత్‌ చైర్మన్‌..
ఉద్యమ నేపథ్యం

మూడు పర్యాయాలు జైలుకెళ్లారు..

1) ఆనాటి హుస్నాబాద్‌ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఇంటి ముట్టడి చేసినప్పుడు రెండు రోజులు జైలుకెళ్లారు..
2) ముల్కనూర్‌కు ఆనాటి రాష్ట్ర మంత్రి శిల్పామోహన్‌రెడ్డి సందర్శనను అడ్డుకున్నందుకు మూడు రోజులు జైలు
3) దండేపల్లిలో రైల్‌రోకోలో పాల్గొన్నందుకు మూడు రోజులు జైలుకు వెళ్లారు.. ఇవేకాక అనేక సార్లు ఉద్యమంలో పోలీసులు అరెస్టు చేశారు. బైండోవర్లు చేశారు.

వరంగల్‌ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్‌కుమార్‌ బయోడేటా

పేరు: మారెపల్లి సుధీర్‌కుమార్‌
తండ్రి : మారెపల్లి జాన్‌, తల్లి : కిరీటమ్మ
భార్య: శోభారాణి, మెడికల్‌ ఆఫీసర్‌, గోపాల్‌పూర్‌, ఎల్కతుర్తి మండలం
కుమారుడు : సుజన్‌కుమార్‌ (బీటెక్‌)
కుమార్తె : సుకీర్తి (అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌, జమ్మికుంట)
కులం : ఎస్సీ(మాదిగ)
పుట్టిన తేదీ : 30-08-1962, జన్మస్థలం : హనుమకొండ
విద్యార్హతలు : ఇంటర్మీడియట్‌ – ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, హనుమకొండ
డిగ్రీ : కాకతీయ డిగ్రీ ప్రభుత్వ కళాశాల, హనుమకొండ
బీఏఎంఎస్‌ : కాకతీయ యూనివర్శిటీ, వరంగల్‌
ఎండీ : (యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌)
నివాసం : ముల్కనూరు, భీమదేవరపల్లి మండలం, హనుమకొండ జిల్లా

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!