Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

తెలంగాణలో 12 స్థానాల్లో బిజెపిని గెలిపించండి :  అమిత్ షా.

Share This Post 🔥


కాస్త సమయమే ఉన్నా తనదైనశైలిలో ప్రసంగం

రెండు గంటలు ఆలస్యంగా సభా వేదికకు…

8 నిమిషాలపాటే సందేశం.. వెంటనే తిరుగుపయనం

మెదక్‌లో గెలిపించి మోదీకి సహకరించాలని పిలుపు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలపై రఘునందన్‌ ఫైర్‌

సహారా బాధితులతో సభలో గందరగోళం

పార్లమెంటు ఎన్నికలలో భాగంగా గురువారం సిద్దిపేటలో నిర్వహించిన బీజేపీ విశాల జనసభ కార్యక్రమం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హాజరై తనదైన శైలిలో ప్రసంగించి కాషాయ దళానికి ఉత్సాహం అందించారు. మెదక్‌ బీజేపీ అభ్యర్థిగా ఉన్న రఘునందన్‌రావును గెలిపించి మోదీ మూడోసారి ప్రధాని అయ్యేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల అవినీతిపై ధ్వజమెత్తారు. సిద్దిపేట వేదిక సాక్షిగా ముస్లిం రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. పదునైన మాటలతో సిద్దిపేట నుంచే తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని అమిత్‌ షా వేడెక్కించారు.

ఇలా వచ్చి.. అలా వెళ్లారు

ఉదయం 12 గంటలకే అమిత్‌షా సిద్దిపేట సభకు రావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఆయన రెండు గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. అప్పటికే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు ఆయన రాకకోసం ఎదురు చూశారు. ఓవైపు మండుటెండలు, ఉక్కపోత ఉండగా మరోవైపు అమిత్‌షా ఆలస్యంగా రావడంతో సభలో ఒకింత నిరుత్సాహం ఆవహించింది. తుదకు అమిత్‌షా రాగానే ఒక్కసారిగా ఉత్సాహం పెల్లుబికింది. 1.56 గంటలకు వేదికపైకి వచ్చిరాగానే మైకు అందుకున్నారు. మెదక్‌ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును తన పక్కన నిలబెట్టుకొని ప్రసంగించారు. కేవలం 8 నిమిషాల్లోనే సందేశం ముగించారు. అయితే ఆ కాస్త సమయంలోనే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల అవినీతిని కడిగిపారేశారు. మరోసారి మోదీ సర్కార్‌ రావాలని పదేపదే కార్యకర్తలతో మమేకమవుతూ మాట్లాడారు. తనదైన మాటలు, నినాదాలతో ఉత్సాహం నింపారు. ఆ వెంటనే తిరుగు పయనమయ్యారు. సభలో సహారా ఇండియా బాధితులు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.

నేను, నా తల్లిదండ్రులు ఏ గడీలో ఉంటున్నామో వచ్చి చూడు రేవంత్‌

తనను గడీల దొర అంటూ మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దుబ్బాకకు రావాలని రఘునందన్‌రావు సవాల్‌ విసిరారు. తాను, తన తల్లిదండ్రులు ఎలాంటి గడీల్లో ఉంటున్నామో వచ్చి చూడాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ వ్యవధిలోనే రేవంత్‌రెడ్డి ఒక నయవంచకుడిగా మారారని విమర్శించారు. అడ్డూఅదుపు లేని హామీలు ఇచ్చి మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల కోసం అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాలుగు పార్టీలు మార్చి, పటాన్‌చెరులో కాంగ్రెస్‌ అభ్యర్థినే ఓడగొట్టిన నీలం మధుకు ఓట్లు పడవని అన్నారు. ఇక అధికార పెత్తనంతో భూములు గుంజుకొని ఎన్నో కుటుంబాలను హింసించిన వెంకట్రామారెడ్డి చరిత్ర అందరికీ తెలుసన్నారు. ఎంగిలి చేత్తో కూడా సాయమందించని ఆయన రూ.100 కోట్ల నిధిని ఎలా ఏర్పాటు చేస్తారని సందేహించారు. ఎన్నికలు కాగానే సిద్దిపేట నుంచి అయోధ్యకు రైలు సౌకర్యం ఉండేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భారతీయులమని గర్వపడేలా చేసిన నరేంద్రమోదీ ప్రధాని కావాలంటే తనను గెలిపించాలని అభ్యర్థించారు.

అంతకుముందు బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలు ప్రేమేందర్‌రెడ్డి, ఆకుల విజయ, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల బీజేపీ అధ్యక్షులు గంగాడి మోహన్‌రెడ్డి, గడ్డం శ్రీనివాస్‌, గోదావరి అంజిరెడ్డి ప్రసంగించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!