ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

తెలంగాణలో వ్యాపారం చేయలేవు…

Share This Post 🔥

ఢీల్లీలోనూ వ్యాపారానికి నష్టం చేస్తానంటూ శరత్‌ చంద్రారెడ్డిని బెదిరించిన కవిత..!

రౌస్‌ అవెన్యూ కోర్టుకు తెలిపిన సీబీఐ

భూమి కొనుగోలు పేరుతో కవితకు రూ.14 కోట్లు చెల్లించిన శరత్‌ చంద్రారెడ్డి

మహబూబ్‌నగర్‌లో కవితకు చెందిన భూమిని కొనుగోలు చేసినట్లు ఒప్పందం

ఇప్పటికీ జరగని భూమి బదలాయింపు!

జాగృతి సంస్థకూ రూ.80 లక్షల చెల్లింపు

ఢిల్లీ మద్యం స్కాంలో కవితది కీలక పాత్ర

ఆమె నుంచి నిజాలు రాబట్టేందుకే విచారణ

కస్టడీ రిపోర్టులో వెల్లడించిన సీబీఐ

న్యూఢిల్లీ ::  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ప్రధాన కుట్రదారుల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను కీలక వ్యక్తిగా సీబీఐ పేర్కొంది. అరబిందో గ్రూప్‌కు చెందిన శరత్‌ చంద్రారెడ్డికి ఐదు మద్యం రిటైల్‌ జోన్లు దక్కడంలో ఆమె కీలకంగా వ్యవహరించారని తెలిపింది. ఇందుకు బదులుగా ఆయన నుంచి కవిత ఆర్థిక లబ్ధి పొందారని న్యాయస్థానానికి వెల్లడించింది. పైగా.. తాను చెప్పిన మొత్తం ఇవ్వకపోతే తెలంగాణలో వ్యాపారం చేయలేవంటూ శరత్‌ చంద్రారెడ్డిని ఆమె బెదిరించారని, ఢిల్లీలో కూడా ఆయన వ్యాపారానికి నష్టం చేస్తానని హెచ్చరించారని తమ కస్టడీ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. కవితను ఎందుకు విచారించాలనుకుంటున్నదీ రౌస్‌ అవెన్యూ కోర్టుకు సమర్పించిన దరఖాస్తులో సీబీఐ వివరించింది. 2021-22 ఢిల్లీ మద్యం విధానం ప్రకారం ఒకే సంస్థకు రెండు రిటైల్‌ జోన్ల కంటే ఎక్కువ కేటాయించరాదని, కానీ.. మూడు సంస్థలకు ఐదు జోన్లు కేటాయించారని, ఈ మూడు సంస్థలూ శరత్‌చంద్రారెడ్డి డైరెక్టర్‌గా ఉన్న అరబిందో ఫార్మా గ్రూప్‌కు సంబంధించినవేనని సీబీఐ వెల్లడించింది. ఈ ఐదు జోన్లు తనకు దక్కినందుకు బదులుగా కవిత నుంచి రూ.14 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని శరత్‌ చంద్రారెడ్డి కొనుగోలు చేసినట్టుగా ఒప్పందం జరిగినట్లు తెలిపింది. మహబూబ్‌నగర్‌లో ఉన్న ఈ భూమిని కొనుగోలు చేసేందుకు సేల్‌అగ్రిమెంట్‌ కుదుర్చుకోవాల్సిందిగా శరత్‌చంద్రారెడ్డిపై కవిత ఒత్తిడి చేశారని పేర్కొంది. ఆ భూమిని కొనడం తనకు ఇష్టంలేదని, దాని విలువ ఏమిటో కూడా తనకు తెలియదని శరత్‌ చంద్రారెడ్డి చెప్పినప్పటికీ.. వెంటనే రూ.14 కోట్లు చెల్లించాలని ఆమె డిమాండ్‌ చేసినట్టు వెల్లడించింది. దీంతో అరబిందో గ్రూపునకు చెందిన మహిరా వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా ఈ మొత్తం చెల్లించి భూమి కొనుగోలు చేయక తప్పలేదని శరత్‌ చంద్రారెడ్డి చెప్పినట్లు సీబీఐ వివరించింది. ఇందులో రూ.7 కోట్లు 2021 జూలైలో, మరో రూ.7 కోట్లు నవంబరులో చెల్లించినట్టు ఆధారాలు లభించాయని తెలిపింది. అయితే తర్వాత ఆ భూమి బదలాయింపు జరగలేదని వెల్లడించింది. మరోవైపు శరత్‌ చంద్రారెడ్డికి చెందిన ఐదు రిటైల్‌ జోన్ల కోసం ఒక్కో జోన్‌కు రూ.5 కోట్ల చొప్పున రూ.25 కోట్లు చెల్లించాలని కూడా కవిత ఆయనకు తెలిపారని సీబీఐ పేర్కొంది. ఒక దశలో ఈ మొత్తం చెల్లించేందుకు శరత్‌ చంద్రారెడ్డి విముఖత వ్యక్తం చేశారని, అయితే తాను చెప్పినట్టు వినకపోతే తెలంగాణలో వ్యాపారం ఎలా చేస్తావని, ఢిల్లీలో కూడా వ్యాపారానికి నష్టం చేస్తానని ఆయనను కవిత బెదిరించినట్టు సీబీఐ వెల్లడించింది. అంతేకాకుండా కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు కూడా సీఎ్‌సఆర్‌ కింద శరత్‌ చంద్రారెడ్డి రూ.80 లక్షలు బదిలీ చేశారని తెలిపింది.కవితకు వ్యతిరేకంగా అనేక సాక్ష్యాలు..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు వ్యతిరేకంగా అనేక సాక్ష్యాధారాలు వెల్లడయ్యాయని సీబీఐ పేర్కొంది. కవితను ఈ సాక్ష్యాధారాల గురించి జైలుకు వెళ్లి ప్రశ్నించామని, అయితే ఆమె సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వనందువల్లే తమ కస్టడీలో విచారణ చేయాలని నిర్ణయించామని వివరించింది. దర్యాప్తులో భాగంగా తాము సేకరించిన మౌఖిక డాక్యుమెంటరీ సాక్ష్యాలకు భిన్నంగా ఆమె జవాబులు ఉన్నాయని, ఆమె వాస్తవాలను వెల్లడించకుండా తప్పించుకున్నారని తెలిపింది. ఆమెకు మాత్రమే తెలిసిన ఆధారాలకు సంబంధించి సాక్ష్యాలను చూపించినా నిజాలు దాచేందుకు యత్నించారని పేర్కొంది. ఈ కేసు సరైన విధంగా ముగింపునకు రావాలంటే కవిత నోటి నుంచి నిజాలు రావాల్సి ఉందని తెలిపింది. తొలుత 2024 ఫిబ్రవరి 26నే తాము 41ఏ సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చినప్పటికీ ఆమె విచారణకు హాజరు కాలేదని సీబీఐ గుర్తు చేసింది. అందుకే కస్టడీకి తీసుకుని సాక్ష్యాలను చూపించి ఇంటరాగేట్‌ చేస్తే తప్ప.. ఆమె ద్వారా మొత్తం కుట్ర ఎంత విస్తృతంగా జరిగిందో, ఎక్కడెక్కడికి అక్రమ నిధుల మళ్లింపు జరిగిందో, ఇతర నిందితులు, ప్రభుత్వ అధికారుల పాత్ర ఎంతో తేలే అవకాశాలున్నాయని పేర్కొంది. కనీసం ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది.

అనేక పత్రాలు లభించాయి..

నిందితుడు బుచ్చిబాబు గోరంట్ల మొబైల్‌ ఫోన్లలో లభించిన వాట్సాప్‌ సంభాషణలు, సాక్షులు, అప్రూవర్ల స్టేట్‌మెంట్ల తర్వాత కవిత పాత్ర బయటకు వచ్చిందని సీబీఐ తెలిపింది. భూమి కుంభకోణం పేరుతో డబ్బు మళ్లింపునకు సంబంధించిన పత్రాలు కూడా తమకు లభించాయని వెల్లడించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి విజయ్‌ నాయర్‌, ఇతర నిందితుల ద్వారా రూ.100కోట్లు మళ్లించడం, ఆ డబ్బును ఇతరుల నుంచి వసూలు చేయడంలో కవిత పోషించిన పాత్ర వెల్లడైందని తెలిపింది. సీబీఐ తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణాదికి చెందిన మద్యం వ్యాపారి మాగుంట శ్రీనివాసులురెడ్డి 2021 మార్చి 16న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. ఢిల్లీలో మద్యం వ్యాపారం చేయడానికి తాను సుముఖంగా ఉన్నానని చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్సీ కవిత మిమ్మల్ని సంప్రదిస్తారని, తమ పార్టీకి కావాల్సిన నిధులు ఎలా మళ్లించాలో కూడా చెబుతారని కేజ్రీవాల్‌ ఆయనకు చెప్పారు. ఆ తర్వాత శ్రీనివాసులురెడ్డి హైదరాబాద్‌లో 2021 మార్చి 20న కవితను ఆమె నివాసంలో కలుసుకున్నారు. దీంతో.. తాము కేజ్రీవాల్‌తో మాట్లాడుతున్నామని, ఆయన బృందం ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందిస్తోందని కవిత తెలిపారు. తనతో, బుచ్చిబాబు, అభిషేక్‌ బోయినపల్లి, అరుణ్‌ పిళ్లైతో మాట్లాడుతూ ఉండాలని సూచించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ముడుపులుగా చెల్లించవలసి ఉందని, మద్యం వ్యాపారంలో భాగస్వామ్యం కావాలంటే ముందుగా రూ.50 కోట్లు చెల్లించాలని అన్నారు. ఆ తర్వాత కవిత సీఏ బుచ్చిబాబు 2021 మార్చి 21న శ్రీనివాసులురెడ్డిని కలుసుకుని రూ.50 కోట్లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత శ్రీనివాసులురెడ్డి తన కుమారుడి ద్వారా కవిత సహచరులు బుచ్చిబాబు, అభిషేక్‌ బోయినపల్లికి రూ.25 కోట్లు చెల్లించారు. దాంతో ఆయన కుమారుడికి ఇండో స్పిరిట్‌ హోల్‌సేల్‌ వ్యాపారంలో రూ.32.5 శాతం వాటాను ఇచ్చారు. మరోవైపు పెర్నాల్డ్‌ రికార్డు ఇండియా ద్వారా ఇండో స్పిరిట్‌కు నిబంధనలకు భిన్నంగా హోల్‌సేల్‌ వ్యాపారం లభించేలా విజయ్‌ నాయర్‌ కీలకపాత్ర పోషించారు. అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఒత్తిడి మేరకు ఇండో స్పిరిట్‌కు ఈ అక్రమ వ్యాపారం కేటాయించారని సీబీఐ తేల్చింది.ఇండో స్పిరిట్‌లో కవితకు భాగస్వామ్యం..

విజయ్‌ నాయర్‌కు రూ.90-100కోట్లు చెల్లించామని, అందులో రూ.30 కోట్లు హవాలా ద్వారా మళ్లించామని అభిషేక్‌ బోయినపల్లి తనకు చెప్పినట్టు అప్రూవర్‌ దినేశ్‌ అరోరా వెల్లడించారని సీబీఐ తెలిపింది. గోవా అసెంబ్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రచారం నిర్వహిస్తున్న చారియట్‌ మీడియా సంస్థకు చెందిన రాజేష్‌ జోషి ఈ డబ్బు తీసుకున్నారని, ఢిల్లీ నుంచి ఈ డబ్బును హవాలా ద్వారా మళ్లించినట్టు హవాలా ఆపరేటర్లు కూడా ఒప్పుకొన్నారని వెల్లడించింది. అభిషేక్‌ బోయినపల్లి ఆదేశాల మేరకు తాను పెద్దఎత్తున నగదును మళ్లించినట్టు కవిత పీఏ అశోక్‌ కౌశిక్‌ చెప్పిన విషయాన్నీ సీబీఐ వెల్లడించింది. అశోక్‌ కౌశిక్‌ ద్వారా రూ.25 కోట్ల పంపిణీ జరిగినట్టుగా ఆధారాలు లభించినట్టు తెలిపింది. తన బినామీ అరుణ్‌ పిళ్లై ద్వారా ఇండో స్పిరిట్‌ హోల్‌ సేల్‌ లైసెన్స్‌లో కవితకు భాగస్వామ్యం ఉందని, సీఏ బుచ్చిబాబు, కవితకు మధ్య మొబైల్‌ ఫోన్లలో జరిగిన సంభాషణ ద్వారా ఈ విషయం తేలిందని సీబీఐ పేర్కొంది. ఎయిర్‌పోర్టు జోన్‌లో మాగుంట రాఘవ కంపెనీ పిక్సీ ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థకు ఎన్‌వోసీ లభించేందుకు కూడా కవిత సహాయ పడ్డారని వెల్లడించింది. 2021 సెప్టెంబరు 20న ఢిల్లీలోని హోటల్‌ తాజ్‌ మాన్‌సింగ్‌లో ఫెర్నార్డ్‌ రికార్డు ఇండియా నిర్వహించిన సమావేశంలో శరత్‌ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, సమీర్‌ మహేంద్రో, అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి పాల్గొన్నట్టు తేలిందని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఫెర్నార్డ్‌ రికార్డుకు చెందిన మనోజ్‌రాజ్‌ మొబైల్‌ ఫోన్లో ఫొటోలు లభించాయని తెలిపింది.

ఇండో స్పిరిట్‌కు చెల్లించాల్సిన డబ్బు.. కవితకు..!

2022 ఆగస్టు 31న ఢిల్లీ మద్యం విధానాన్ని ఉపసంహరించుకున్నప్పుడు ఇండో స్పిరిట్‌కు రూ.60 కోట్లు చెల్లించాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. అయితే ఆ డబ్బును ఆ సంస్థకు కాకుండా కవితకే చెల్లించాలని శరత్‌ చంద్రారెడ్డికి అరుణ్‌ పిళ్లై చెప్పినట్టు తెలిపింది. తాను చెల్లించిన రూ.100 కోట్లను తిరిగి సంపాదించుకోవాలని కవిత భావిస్తున్నట్లుగా శరత్‌ చంద్రారెడ్డి చెప్పారని వెల్లడించింది. 2022 డిసెంబరు 11న హైదరాబాద్‌లో కవితను తాము విచారించామని, అయితే అప్పటికి రాఘవ మాగుంట ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులురెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి తమ ేస్టట్‌మెంట్లను రికార్డు చేయలేదని సీబీఐ తెలిపింది. వీరి ేస్టట్‌ మెంట్ల తర్వాతే కవిత పాత్ర స్పష్టంగా తేలిందని పేర్కొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!