Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

జానాను, జైపాల్ రెడ్డిని కాదు : సీఎం రేవంత్ రెడ్డి.

Share This Post 🔥

కేసీఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల జోలికొస్తే మా కార్యకర్తలు ఊరుకోరు

కారు కార్ఖానాకు పోయింది.. తుక్కు కింద తూకానికి అమ్మాల్సిందే

ఢిల్లీ మోదీ, గజ్వేల్‌ కేడీలిద్దరూ ప్రజలను వంచించారు

పంద్రాగస్టుకు రూ.రెండు లక్షల రుణమాఫీ, వచ్చే సీజను నుంచి ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తాం

ఏడుపాయల దుర్గమ్మ, మెదక్‌ చర్చి సాక్షిగా చెబుతున్నా..

ఎంపీలుగా గెలిచిన బీఆర్‌ఎస్‌ నేతలు మెదక్‌ అభివృద్ధికి చేసిందేమీ లేదు

మెదక్‌ రోడ్‌ షోలో సీఎం రేవంత్‌రెడ్డి

సంగారెడ్డి:   కాంగ్రెస్‌ పార్టీ అంటే ఇరవై పెగ్గులేస్తే ఖాళీ అయ్యే రెండు లీటర్ల ఫుల్‌బాటిల్‌ కాదు.. 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ అంటున్నారు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కాపలా ఉన్నది జైపాల్‌ రెడ్డి, జానారెడ్డి కాదు.. మా ఎమ్మెల్యే లను టచ్‌ చేసి చూడు హైటెన్షన్‌ వైరుకు తగిలి మాడి మసై పోతావు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల జోలికొస్తే మా కార్యకర్తలు బట్టలూడదీసి కొడతారు’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం మెదక్‌లోని రాందాస్‌చౌర స్తాలో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో సీఎం ప్రసంగించారు.

‘కేసీఆర్‌ నౌకరీ పోయి, నడుం విరిగి.. పార్టీ ఓడిపోయి.. ఏం చేయాలో తెలియక.. పిట్టల దొరలెక్క ఇంట్ల కూర్చొని భజన సంఘం ముందు కాంగ్రెస్‌ పనైపోయిందని అంటున్నాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతానంటున్నాడు. మోదీని తెచ్చుకుంటావో.. మోదీ తాతను తెచ్చుకుంటావో? చూస్తా. కేసీఆర్‌ పనైపోయింది.. కారు కార్ఖానాకు పోయింది.. బీఆర్‌ఎస్‌ దుకాణం బంధ్‌ అయింది.. కారును తుక్కు కింద తూకానికి అమ్మాల్సిందే’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

మోదీ.. కేడీలు తోడు దొంగలు
తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గజ్వేల్‌ కేడీ పనైపోయిందని, ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మోదీ పనైపోతుందని సీఎం రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్, మోదీలిద్దరూ మెదక్‌కు నయా పైసా ఇవ్వలేదని, ఇద్దరూ తోడుదొంగలేనన్నారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని వేసి రాష్ట్రంలోని లక్షలాది మంది పద్మశాలీల ఉపాధిపై కేంద్ర ప్రభుత్వం దెబ్బకొట్టిందని మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్‌ల కోసం ఢిల్లీలో నిరసన తెలిపిన వేలాది మంది రైతులపై ఉక్కుపాదం మోపిందన్నారు.

రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరింట ఐదు గ్యారంటీలను అమలు చేస్తే.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 25 లక్షల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ గృహాలను ఇచ్చారని గుర్తు చేశారు. సోయి లేని సన్నాసి.. దద్దమ్మ కేసీఆర్‌ మాత్రం డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పేరుతో నిరుపేదలను వంచన చేశారన్నారు. రానున్న రోజుల్లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి ఐదు లక్షల చొప్పున రూ.20 వేల కోట్లతో 4.50 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు.

ఒట్టేసి చెబుతున్నా...
ఆగస్టు 15లోగా రూ.రెండు లక్షల రైతుల రుణమాఫీ చేసి తీరుతానని మెదక్‌ చర్చి.. ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా చెబుతున్నానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే వచ్చే సీజను నుంచి ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్‌ ఇస్తామని ప్రకటించారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు, సీఎంగా పనిచేసిన కేసీఆర్‌లు దళితులకు మూడెకరాలు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వలేదన్నారు.

దూలం లెక్క పెరిగితే సరిపోదని.. దూడకున్న జ్ఞానం ఉండాలంటూ హరీశ్‌పై విమర్శలు గుప్పించారు. పదేళ్లు అధికారంలో ఉండి చేయలేని ఈ సన్నాసులు.. వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసిన తమను దిగిపోవాలని అంటున్నారని చెప్పారు. దిగిపోమంటే దిగిపోవడానికి తాము మామూలుగా అధికారంలోకి రాలేదని, మీలాంటి వాళ్లను తొక్కుకుంటూ వచ్చామని స్పష్టం చేశారు. పదేళ్లు ఇక్కడే ఉంటామని, తమ ప్రభుత్వాన్ని దించేయడానికి ఎవరొస్తారో చూస్తానని అన్నారు.

కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ను మెదక్‌ ఆదరించింది


కాంగ్రెస్‌ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మెదక్‌ ప్రజలు ఆదరించారని రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఇక్కడి నుంచి ఇందిరమ్మను గెలిపించుకుని దేశానికి ప్రధానమంత్రిని చేశారని చెప్పారు. ఇందిరమ్మ బీహెచ్‌ఈఎల్, బీడీఎల్‌ వంటి పరిశ్రమలతోపాటు ఇక్రిశాట్‌ వంటి సంస్థలను స్థాపించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు.

1999 నుంచి 2024 వరకు రెండున్నర దశాబ్దాలు మెదక్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన బీఆర్‌ఎస్‌ నేతలు ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఆలె నరేంద్ర మొదలుకుని కొత్త ప్రభాకర్‌రెడ్డి వరకు ఆ పార్టీ వారే ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికవుతున్నారని.. వీరు ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌తోపాటు, బీజేపీ కూడా సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతోందని, ఎన్నికలు రాగానే వాకిలి అలుకుతాం.. ముగ్గులేస్తాం.. ఇంటిని చక్కదిద్దుతామంటున్నాయని ఎద్దేవా చేశారు.

కర్రుకాల్చి వాత పెట్టినా సిగ్గురాదా.? : పొంగులేటి
రాష్ట్రంలో కేసీఆర్‌ పతనమైనప్పటికీ తానే ఇంకా సీఎం అనుకుంటూ వెర్రివాగుడు వాగుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కర్రుకాల్చి ఫాంహౌస్‌కే పరిమితం చేసినా ఆయనలో మార్పు రావడం లేదన్నారు. కాంగ్రెస్‌ దిగిపోతుందని, 20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మాట్లాడటం సిగ్గుచేటని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల అనంతరం కేసీఆర్‌ దుకాణం తెలంగాణలో బంద్‌ అవుతుందని, త్వరలో ఆయన బీజేపీలో చేరతారని జోస్యం చెప్పారు. కార్నర్‌ మీటింగ్‌లో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యే రోహిత్‌రావు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హన్మంతరావు, మదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!