ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

గూగుల్‌లో ఉద్యోగమంటూ.. రెండో పెండ్లికి సిధ్ధమన్నాడు..  పెళ్లి పేరుతో రూ.1.8 కోట్లు కొట్టేశాడు.

Share This Post 🔥

షాదీ.కామ్‌లో మహిళను పరిచయం చేసుకొని..
గ్లాస్‌ కట్టర్‌ నుంచి ఘరానా చీటర్‌గా ఎదిగిన నిందితుడు.
అరెస్టు చేసిన సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.

జీవితాంతం నీతోనే ఉంటానంటూ ఓ మహిళను నమ్మించి రూ.1.8 కోట్లు కొట్టేసిన ఘరానా మోసగాన్ని సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పెండ్లి పేరుతో చాలా మందిని నమ్మించి, డబ్బు కాజేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. పలువురు బాధితులు బయటకు చెప్పుకోలేక ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడినట్టు విచారణలో తేలింది. సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ రవీందర్‌రెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు. చిత్తూరు జిల్లాకు చెందిన కొమినేని వంశీ చౌదరి హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న వెంకటాద్రి రెసిడెన్సీలో ఉంటున్నాడు. డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసి.. 2009లో బెంగళూర్‌కు వెళ్లాడు. అక్కడ ఫ్లైవుడ్‌ షాప్‌లో గ్లాస్‌ కట్టర్‌గా చేరాడు. ఆ దుకాణం పక్కనే జాబ్‌ కన్సల్టెన్సీ కార్యాలయం ఉన్నది. అక్కడికి వచ్చిపోయే వారితో మాట్లాడుతూ.. ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉంటాయి.. ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి.. అనే విషయాలను అడిగి తెలుసుకున్నాడు. అక్కడి నుంచే మోసాలు చేయడం ప్రారంభించాడు. పెండ్లి చేసుకుంటానని మహిళలను నమ్మించి అందిన కాడికి దోచుకోవడం మొదలు పెట్టాడు. మహిళల నుంచి దోచుకున్న సొమ్ముతో విలాస వంతమైన జీవితాన్ని గడుపుతూ, ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడ్డాడు.

ఈ క్రమంలోనే షాదీ.కామ్‌లో తన ప్రొఫైల్‌ను అప్‌లోడ్‌ చేశాడు. తాను విడాకులు తీసుకున్నానంటూ తన ప్రొఫైల్‌లో పొందుపరిచాడు. రెండో పెండ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ పేర్కొన్నాడు. అంతేకాదు.. తాను అమెరికాలోని గూగుల్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు సూచించాడు. గూగుల్‌ పేరుతో ఓ నకిలీ ఐడీ కార్డు, ఇండియన్‌ కస్టమ్స్‌కు సంబంధించిన ఫేక్‌ స్టాంపులతో సర్టిఫికెట్లు కూడా తయారు చేసి, పలువురిని నమ్మించాడు. ఇదిలా ఉండగా.. బాధితురాలి భర్త 2008లో అనారోగ్యంతో చనిపోయాడు. ఆమె అమెరికా, ఇంగ్లాండ్‌లో ఉద్యోగాలు చేసింది. ఆమె ఇంట్లో రెండో పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో తన ప్రొఫైల్‌ను 2018లో షాదీ.కామ్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బాధితురాలి ప్రొఫైల్‌ను చూసిన వంశీ చౌదరి, ఆమెను పెండ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటూ మెసేజ్‌ పెట్టాడు. ఆమెను మోసం చేసేందుకు ప్రత్యేకంగా రెండు ఈ మెయిల్‌ ఐడీలు, అమెరికా, లండన్‌ నంబర్లను రూ.1,610 చొప్పున మూడు కొనుగోలు చేసి, ఆ నంబర్లతోనే అమెరికాలో ఉన్నట్లు బాధితురాలిని నమ్మించేందుకు మెసేజ్‌ పంపించాడు. పెండ్లి చేసుకున్న తరువాత కూడా అమెరికాకు వస్తానంటేనే పెండ్లి చేసుకుంటానంటూ వంశీ చౌదరి షరతు కూడా విధించాడు.

బాధితురాలి కుటుంబ సభ్యులు పెండ్లికి ఒప్పుకున్నారు. కొద్ది రోజుల తర్వాత తాను అమెరికా నుంచి వస్తున్నాను.. అని చెప్పి.. ఓ రోజు బాధితురాలి ఇంటికి వెళ్లాడు. తన మాయమాటలతో బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను నమ్మించి ఒప్పించాడు. కొద్దిరోజుల తర్వాత ఈ పెండ్లికి తన కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంలేదని, నాకు వారు అవసరంలేదు.. నీతోనే నా పెండ్లి అంటూ నమ్మించాడు. అంతేగాక.. ఇష్టంలేని పెండ్లి చేసుకుంటున్నానంటూ నా కుటుంబ సభ్యులు తన మొత్తం బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేశారని, ఆర్థికంగా సహకరించాలని, అమెరికా వెళ్లిన తర్వాత మొత్తం డబ్బు తిరిగి ఇస్తానంటూ నమ్మించి, బాధితురాలి కుటుంబం నుంచి రూ.1.8 కోట్లు కాజేశాడు. కరోనా సమయంలో బాధితురాలి కూతురు ఆస్పత్రిలో చేరగా.. ఆస్పత్రి ఖర్చుల కోసం కొంత డబ్బు ఇవ్వాలని కోరగా.. చేతులెత్తేశాడు. చిన్నారి మరణించింది. ఆ తర్వాత నిందితుడు కనిపించకుండా పోయాడు. ఇదంతా మోసమని గుర్తించిన బాధితురాలు.. అతడిని వెతకడం మొదలుపెట్టింది. ఎక్కడా అతడి ఆచూకీ తెలియకపోవడంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన ఏసీపీ రవీందర్‌రెడ్డి నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రమేశ్‌ బృందం నిందితుడిని అరెస్టు చేసింది. అతడి వద్ద నుంచి ఫోన్లు, కస్టమ్స్‌ అధికారులకు సంబంధించిన నకిలీ రబ్బర్‌ స్టాంపులు, గూగుల్‌, కస్టమ్స్‌కు చెందిన నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!