ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

కెసిఆర్ కుటుంబం పై వరుస కేసులు

Share This Post 🔥నిన్న కవిత.. ఇప్పుడు సంతోష్‌
మధ్యలో కేసీఆర్‌ అన్న కుమారుడు
కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌కూ తప్పదా?
కవిత భర్త లావాదేవీలపైనా ఆరా!

తెలుగు న్యూస్ టైమ్, హైదరాబాద్ : బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం వరుస కేసులు, విచారణలతో విలవిలలాడుతున్నది. ఒక రకంగా కేసులు, విచారణల పద్మవ్యూహంలో చిక్కుకుంది. ఒకవైపు ఈ కేసులతోపాటు.. పార్టీ నుంచి వలసలతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేయడం బిగ్ షాక్‌నివ్వగా, దాని నుంచి తేరుకోకముందే కేసీఆర్ అన్న కుమారుడైన కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. ఓఎస్సార్ ప్రాజెక్టు నిర్మాణాలు చేస్తుండగా కన్నారావు రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో 2 ఎకరాల భూమిని కబ్జా చేశారని విచారణలో తేలడంతో కన్నారావుతో పాటు 38 మందిపై కేసులు నమోదు చేశారు. మరుసటి రోజునే బీఆరెస్‌ మాజీ ఎంపీ, కేసీఆర్‌కు కొడుకు వరుసైన జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై భూ కబ్జా కేసు నమోదైంది. మరోవైపు లిక్కర్‌ పాలసీ కేసులో కవిత భర్త అనిల్‌ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నదన్న చర్చ నడుస్తున్నది. ఆయన ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.

సంతోష్‌పై నవయుగ కంపెనీ ఫిర్యాదు…

బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లో భూమి కబ్జాకు యత్నిస్తున్నారంటూ నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్ పాటు లింగారెడ్డి, శ్రీధర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వే నంబర్ 129/54లో 1350 చదరపు గజాల స్థలాన్ని నవయుగ సంస్థ కొనుగోలు చేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలం కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ నెల 21న కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో 400, 471, 447, 120బీ రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

మెడపై కత్తుల్లా విచారణలు.

కేసీఆర్ కుటుంబ సభ్యులపై వరుస కేసుల నమోదు సాగుతున్న క్రమంలో అధినేత కేసీఆర్, కేటీఆర్‌, హరీశ్‌రావులపై కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేయవచ్చన్న వాదన వినిపిస్తున్నది. అక్రమాలు జరిగినట్టు తేలితే ఎవరినైనా అరెస్టు చేస్తామని ప్రభుత్వం పెద్దలు తరచూ చెబుతూనే ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణతో పాటు రిటైర్డ్ జడ్జితో జ్యుడిషియల్‌ విచారణకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తోడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథార్టీ సైతం విచారణ చేస్తున్నది. అటు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు.. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ఫ్లాంట్ల నిర్మాణాల వివాదాలపై కూడా విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఫార్ములా ఈ రేస్‌, అవుటర్ రింగ్ రోడ్డు ఒప్పందం వంటి వివాదాలు ఉండనే ఉన్నాయి. ఆయా వివాదాల విచారణల ముగింపు క్రమంలో కేసీఆర్, కేటీఆర్‌, హరీశ్‌రావు, మాజీ మంత్రులపై కేసులు నమోదయ్యే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా ఎస్‌ఐబీలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతూ అంతిమంగా బీఆరెస్ పెద్దలకు.. ముఖ్యంగా కేటీఆర్ లేక కేసీఆర్‌కు చుట్టుకునే అవకాశముందన్న ప్రచారం వినిపిస్తున్నది. ఓఎస్‌డీ ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు ట్యాపింగ్ బృందం సిరిసిల్లలో సైతం ట్యాపింగ్ కేంద్రం నిర్వహించడం ఈ కేసులో ఆసక్తికర అంశంగా కనబడుతున్నది. తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ లింకులు భారీగానే బయటపడే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు.

అనిల్‌ ఆర్థిక లావాదేవీలపై ఆరా

ఒకవైపు కవితను విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు.. ఆమె భర్త అనిల్ ఆర్థిక లావాదేవులపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. అనిల్ సోదరి అఖిల, వారి బంధువులైన మేక చరణ్ ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. లిక్కర్ పాలసీ స్కామ్‌లో వచ్చిన సొమ్మును పంజాబ్‌, గోవా ఎన్నికలకు ఎలా చేరవేశారన్న విషయంలో ఆధారాలు సంపాదించే పనిలో ఉన్నట్టు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సైతం ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది.

రాజకీయ కోణంలోనే నాపై అక్రమ కేసు : సంతోష్‌కుమార్‌

రాజకీయ కోణంలోనే తనపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ ఫోర్జరీ కేసు బనాయించిందని మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ ఆరోపించారు. షేక్ పేటలోని సర్వే నంబర్ 129/54లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలాన్ని తాను శ్యాంసుందర్ ఫుల్జాల్ అనే వ్యక్తి నుంచి 2016లో (సేల్ డీడ్ నంబర్ 5917/2016. 11 నవంబర్ 2016) పూర్తి చట్టబద్ధంగా కొనుగోలు చేశానని ఆయన పేర్కొన్నారు. రూ.3 కోట్ల 81 లక్షల 50 వేలు చెల్లించి, సేల్ డీడ్ ద్వారా, రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేశానని వెల్లడించారు. ఇందులో ఫోర్జరీ అనే మాటకు తావులేదని సంతోష్‌ స్పష్టం చేశారు. కేసులో పేర్కొన్న అభియోగాలు కూడా వాస్తవం కాదని ఆయన చెప్పారు. ఎనిమిది సంవత్సరాలుగా ఎలాంటి న్యాయవివాదం తలెత్తలేదని, తనను ఎవరూ సంప్రదించలేదని తెలిపారు. తనకు ఇంటి స్థలాన్ని అమ్మిన శ్యాంసుందర్ ఆ భూమిని 1992లో సేల్ డీడ్ నంబర్ 1888/1992 ద్వారా కొనుగోలు చేశారని, అప్పటినుంచి ఎలాంటి న్యాయవివాదాలు లేవని ఆయన తనకు స్పష్టంగా తెలియజేశారని చెప్పారు. అంటే దాదాపు 32 ఏళ్లుగా ఆ భూమిపై ఎలాంటి న్యాయవివాదాలు లేవని తెలిపారు. తాను కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని, శ్యాంసుందర్, అంతకన్నా ముందు వాళ్లు చేపట్టిన నిర్మాణాలే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆ స్థలం గడిచిన 32 సంవత్సరాలుగా తనకు అమ్మిన వ్యక్తి ఆధీనంలో, తర్వాత తన ఆధీనంలోనే ఉన్నదన్నారు.

ఒకవేళ ఏమైనా న్యాయపరమైన అంశాలు ఉంటే ముందుగా తనకు లీగల్ నోటీసు ఇవ్వాలని, వివరణ అడగాలని, కానీ అలాంటివేమీ లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ చేశామని ఫిర్యాదు చేశారని సంతోష్‌ వెల్లడించారు. వివాదాస్పద ఇంటి స్థలం 1350 గజాలు అని పోలీసులు, మీడియా పేర్కొంటుందని, కానీ తాను కొన్నది 904 గజాల స్థలం మాత్రమేనని వివరణ ఇచ్చారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిన కేసు అని స్పష్టం చేశారు. తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదన్న సంతోష్‌.. తాను కొనుగోలు చేసిన భూమిపై ఎవరైనా విచారణ చేసుకోవచ్చన్నారు. న్యాయపరంగా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తమ పార్టీపై, తనపై రాజకీయ కక్షతో బురద జల్లాలని చూస్తే సహించేది లేదని, తప్పుడు ఆరోపణలు చేసి, తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాలని చూస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!